Site icon Bhakthi TV

పూజ కోసం తులసి పత్రాలను ఎలా కోయాలి?

తులసి మొక్కను ఎలా పూజించాలో తెలుసుకున్నాం. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదమని చెబుతారు. ఉదయం లేవగానే తులసికి పూజ చేసిన తర్వాతే చాలా మంది మహిళలు పచ్చి గంగైనా ముట్టరు. ఉదయము, సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు. పూజ కోసం తులసీ పత్రాలను ఎలా కోయాలి అన్నదానికి సనాతన ధర్మం ఒక పద్ధతిని తెలియజేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం. తులసీం యే విచిన్వంతి ధన్యాస్తే కరపల్లవాః – పూజ చేయటం కోసం తులసి దళాలను త్రెంపిన చేతులు ఎంతో ధన్యములు అని స్కాందపురణం చెప్పింది.

తులసి చెట్టు నుంచి దళాలను మంగళ, శుక్ర, ఆది వారములలో, ద్వాదశి, అమావాస్య, పూర్ణిమ తిథులలో, సంక్రాంతి, జనన మరణ శౌచములలో, వైధృతి వ్యతీపాత యోగములలో త్రెంప కూడదు. ఇది నిర్ణయసింధులో, విష్ణుధర్మోత్తర పురాణంలో తెలియజేయబడినది. తులసి లేకుండా భగవంతుని పూజ సంపూర్ణం అయినట్లు కాదు. ఇది వరాహ పురాణంలో చెప్పబడింది. కాబట్టి నిషిద్ధమైన రోజులలో, తిథులలో తులసి చెట్టు కింద స్వయంగా రాలి పడిన ఆకులతో, దళములతో పూజ చేయాలి. ఒకవేళ అలా కుదరకపోతే ముందు రోజే తులసి దళములను త్రెంపి దాచుకొని మరుసటి రోజు ఉపయోగించాలి. సాలగ్రామ పూజకు మాత్రం ఈ నిషేధము వర్తించదు. సాలగ్రామమున్నవారు అన్ని తిథివారములయందు తులసి దళములను తెంపవచ్చు. ఎందుకంటే సాలగ్రామం స్వయంగా విష్ణు స్వరూపం. శ్రీమహావిష్ణువు మందిరంలో వచ్చి ఉన్నప్పుడు ఏ దోషాలూ వర్తించవు.

Share this post with your friends
Exit mobile version