Site icon Bhakthi TV

మన ఇష్టదైవాన్ని ఎలా ప్రార్థించాలి?

ప్రార్థన (ప్ర+ఆర్థన) అంటే చక్కగా వేడుకోవడం. ఈ వేడుకోలుకు అర్థం, పరమార్థం అనేవి రెండూ బొమ్మ బొరుసు లాంటివి. మనిషి ఈ ప్రపంచంలో సుఖంగా ఉండాలనుకోవడం, అందుకు తగ్గ వెసులుబాటుకోసం ప్రయత్నించడం సహజం. ధర్మంగా ధనం సంపాదించుకోవచ్చు. ధర్మబద్ధంగా కోరికలు తీర్చుకోవచ్చు. ధనం ఇంధనంలా దహించుకుపోతుంది. కోరికలు గుర్రాల్లా పరుగులు తీస్తూనే ఉంటాయి. ఈ విషయం ప్రతి మనిషికీ ఏదో ఒక రోజు అర్థం అవుతుంది. అప్పుడు ఈ భౌతికమైన సుఖాలు కేవలం తాత్కాలికమేనన్న తెలుస్తుంది. వీటికి మించిన శాశ్వతానందం ఎక్కడుందన్న జిజ్ఞాస మొదలవుతుంది. గుండెలోతుల్లో నుంచి గంగాజలంలా పైకి లేచిన ఆ ఆకాంక్ష, ఒక ఆర్తనాదమై ఒక ఆవేదనారూపమై చెలరేగుతుంది. అదే ప్రార్థన!

దూడను ప్రసవించగానే గోమాత తన బిడ్డను ఆప్యాయంగా నాలుకతో నిమిరినట్టు, భగవంతుడు భక్తులను లాలించి, పాలిస్తాడు. పరమ ప్రేమస్వరూపుడైన భగవంతుడికి తన సంతానంపై ఉన్న అనంతమైన ప్రేమానురాగాలను వరాల రూపంలో అందిస్తాడు. సాత్వికులైన ధ్రువుడు, ప్రహ్లాదుడు శ్రీమహావిష్ణువు సాక్షాత్కరించగానే భౌతికమైన వాంఛలు తొలగి భగవంతుడి పాదసేవనం అనే పరమానందం కావాలని అడిగారు. తపస్సు చేసిన హిరణ్యకశిపుడు, రావణుడు అధికారం, ఆధిపత్యం కోరారు! కోరి తమ వినాశాన్ని వారే కొని తెచ్చుకున్నారు. పరుల సుఖాల్నే మన సుఖమని, విశ్వశ్రేయమే మనకూ శ్రేయోదాయకమని, బుద్ధిగా జీవించాలని త్రికరణ శుద్ధితో ఆ పరమాత్మకు చేసే విన్నపమే ప్రార్థన! అదే మన ఆధ్యాత్మిక ప్రగతికి తొలి సోపానం.

Share this post with your friends
Exit mobile version