
తలపై ఉండే కిరీటానికి ఉండే విలువ పాదరక్షలకు ఉండదు. కానీ తలపై కిరీటం లేకున్నా మనం ఎక్కడికైనా వెళ్లగలం కానీ పాదరక్షలు లేకుంటే మాత్రం బయట అడుగు కూడా పెట్టలేం. కాబట్టి దేనినీ చులకనగా చూడకూడదు. దేనికుండే గొప్ప దానిదే. ప్రయోజనాన్ని బట్టి అంచనా వేస్తే పాదరక్షలకే ఎక్కువ ప్రయోజనం. కాబట్టి భగవంతుని సృష్టిలో అంతా సమానమే. దీని గురించి చెప్పే ఒక కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకరోజు శ్రీ మహవిష్ణువు శిరస్సుపైనున్న కిరీటం.. స్వామివారి పాదరక్షలను చూసి హేళన చేసిందట. అంతేకాకుండా కించపరుస్తూ మాట్లాడిందట.
“నేను శ్రీ మహవిష్ణువు శిరస్సుపై దర్పంగా వెలుగొందుతున్నా.. నువ్వేమో స్వామివారి పాదాల కింద ఉన్నావు. నిన్ను విష్ణుమూర్తి మాత్రమే కాకుండా సాధారణ మనుషులు సైతం వేసుకుని తిరుగుతారు.. ఊరంతా తిరిగొచ్చి నిన్ను గుమ్మం బయటే విడిచిపెట్టి ఇంట్లోకి వస్తారు. అంతేకాకుండా నీకు ఆలయాలలోకి కానీ, ఇంట్లోకి కానీ ఎక్కడకూ ప్రవేశం లేదు’’ అని హేళన చేసింది. పైగా తన గురించి చాలా గొప్పగా చెప్పింది. ‘‘స్వామివారు నన్ను శిరస్సుపై ధరించడమే కాకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అన్ని అర్హతలున్న చోట మాత్రమే నన్ను ఉంచుతారు. నిన్ను బయటే ఉంచినట్టు నన్ను బయటకు విసరరు” అని పాదరక్షలను మరింత రెచ్చగొట్టేలా కిరీటం మాట్లాడింది. ఆ తరువాత ఏం జరిగిందో తదుపరి కథనంలో తెలుసుకుందాం.
