Site icon Bhakthi TV

కుమారస్వామి.. శరవణభవుడు ఎలా అయ్యాడంటే..

పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I
అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా II
తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I

పరమ పురుషుడు శివుడు లేక విష్ణువు. అవ్యక్త శక్తి ఉమాదేవి లేక లక్ష్మీదేవి. వీరిరువురి సమైక్య సమన్వయ తత్వమూర్తి కుమారస్వామి అని స్కాంద పురాణం చెబుతోంది. అంటే కుమారస్వామిని పూజిస్తే శివశక్తుల్నీ , లక్ష్మీనారాయణులనీ కలిపి పూజించినట్లే. ప్రకృతీ పురుషుల ఏకత్వం కుమార స్వామి తత్త్వం. కుమార జననంలోనే అనేక తాత్త్విక మర్మాలు ఉన్నాయి. పరతత్వం – అవ్యక్తం నుంచి జగద్రూపం తీసుకొనే పరిమాణ క్రమం కుమార జననంలో కనబడుతుంది. అమోఘమైన శివతేజాన్ని పృథ్వి, అగ్ని, జలం (గంగ), నక్షత్ర శక్తి (షట్ కృత్తికలు) ధరించి చివరకు బ్రహ్మతపోనిర్మితమైన శరవణం (రెల్లు తుప్ప) లోంచి ఉద్భవించినవాడు కనుక శరవణభవుడు అయ్యాడు.

కాలస్వరూపం:

వేదాలలో షణ్ముఖీయమైన సంవత్సర స్వరూపంగా స్వామిని వర్ణించారు. కాలాగ్ని స్వరూపమే ఇది. కాలాగ్నిరుద్రుడైన శివుని తేజమే ఈ సంవత్సరాగ్ని. ఆరు ముఖాలు – ఆరు ఋతువులు. పన్నెండు చేతులు – పన్నెండు మాసాలు. ఇదీ సంవత్సరాగ్ని రూపం. ఈ రూపం చిత్రాగ్ని అనే నెమలిపై ఆసీనమయ్యింది. వివిధ వర్ణాలను వెదజల్లే కాంతి పుంజమే ఈ నెమలి.

Share this post with your friends
Exit mobile version