ప్రదోష వ్రతం గురించి తెలిసిందే. హిందూమతంలో దీనికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఇది ప్రతి నెలలో రెండు సార్లు వస్తుంది. కృష్ణ, శుక్ల పక్ష త్రయోదశి రోజున ప్రదోష వ్రతం ఆచరిస్తారు. ఈ రోజున శివుడిని పూజిస్తారు. శివుడిని పూజించి ఈ రోజంతా ఉపవాసం ఉంటే కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం. ఈ రోజున రుద్రాక్ష ధరిస్తే చాలా మంచిదట. జీవితంలో శాంతి, ఆనందం, శ్రేయస్సు కలుగుతాయని నమ్మకం. శివుని కన్నీటి చుక్క నుంచి రుద్రాక్ష పుట్టిందని చెబుతారు. శివ పురాణం, స్కంద పురాణంలో దీని గురించి వివరంగా వివరించడం జరిగింది.
పురాణాల ప్రకారం త్రిపురాసురుడు అనే రాక్షసుడు భూమిపై ప్రజలతో పాటు దేవతలను హింసిస్తూ ఉండేవాడు. అతడిని ఎదుర్కొనేందుకు దేవతలు ఎన్ని ప్రయత్నాలూ చేసినా సాధ్య పడలేదు. దీంతో దేవతలంతా కలిసి శివుడిని శరణు వేడుకునేందుకు కైలాసానికి వెళ్లారు. అప్పుడు శివుడు యోగాసనంలో ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. పరమేశ్వరుడి తపస్సు పూర్తైన తర్వాత ఆయన కళ్ల నుంచి నీళ్లు రాలి భూమిపై పడ్డాయి. అవి ఎక్కడ పడ్డాయో అక్కడ రుద్రాక్ష వృక్షాలు పెరిగాయి. అలా శివుడి కళ్ల నుంచి రుద్రాక్షలు పుట్టాయి. వీటిలో 14 రకాలున్నాయి. ఇక ఈ రుద్రాక్షలను అమావాస్య, పౌర్ణమి, శ్రావణ మాసం సోమవారం, ప్రదోష ఉపవాసం చేసే సమయంలో రుద్రాక్షను ధరిస్తారు.