Site icon Bhakthi TV

తిరుమలకు విచ్చేసే భక్తుల ఆరోగ్య భద్రతే ప్రథమ కర్తవ్యం : టీటీడీ ఈవో

తిరుమలకు వచ్చే భక్తులకు సరసమైన ధరలకు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడంతోపాటు వారి ఆరోగ్య భద్రతే టీటీడీ అత్యంత ప్రాధాన్యత అని టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు. టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు ఆదేశాల మేరకు టీటీడీ ఆరోగ్య విభాగం, ఆహార భద్రత విభాగాలతో కలిసి తిరుమలలోని హోటళ్ల నిర్వాహకులకు, యజమానులకు తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ సత్సంగం హాల్లో బుధవారం నాడు జరిగిన శిక్షణా కార్యక్రమంలో అదనపు ఈవో ప్రసంగిస్తూ, అన్ని రకాల తినుబండారాలు ఫుడ్ సేఫ్టీ నిర్దేశించిన ప్రమాణాలను పాటించాలని అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే వేలాది మంది భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల ప్రకారం హోటళ్ళను నిర్వహించాలన్నారు.

హోటళ్ల లోపల పరిశుభ్రత, ఆహార పదార్థాలు నిల్వ చేయడం, వడ్డించడం వంటి విధానాలను ఎప్పటికప్పుడు పరిశీలించి క్రమబద్ధీకరించడం, తదితర విషయాలను నిశితంగా పరిశీలించాలని ఆయన హోటళ్ల వారికి చెప్పారు. తరువాత న్యూ ఢిల్లీకి చెందిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సర్టిఫైడ్ ట్రైనర్ శ్రీ సిహెచ్ ఆంజనేయులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఫుడ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో అన్ని రెస్టారెంట్‌లు మరియు తినుబండారాలలో అనుసరించాల్సిన పరిశుభ్రత మరియు పారిశుద్ధ్య పద్ధతులు, ఆహారం చెడిపోవడం వల్ల కలిగే భౌతిక-రసాయన-జీవ ప్రమాదాలు, వృధా వంటి వాటి గురించి వివరించారు, నిబంధనలను ఉల్లంఘిస్తే తీసుకునే చర్యలు వంటి అనేక అంశాలను తెలియజేశారు.

Share this post with your friends
Exit mobile version