Site icon Bhakthi TV

పెద్దశేష వాహనంపై గోవిందుడి వైభ‌వం.. ఇవాళ హంసవాహనంపై

తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు గురువారం రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవిందరాజస్వామి భక్తులను క‌టాక్షిచారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని సేవించుకున్నారు.

శేషుడు స్వామివారికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నారు. శేషుణ్ణి దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలె నాకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలితాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు బోధించారు. ఈ వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల‌ శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, ఎఫ్ ఏ అండ్ సిఏఓ శ్రీ బాలాజీ, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక ఇవాళ ఉదయం గోవిందరాజ స్వామివారు చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిస్తున్నారు. రాత్రికి హంస వాహనంపై దర్శనమివ్వనున్నారు.

Share this post with your friends
Exit mobile version