
చాలామందికి బద్రీనాథ్ వెళ్లాలని ఉంటుంది. వయసులో ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలు.. ఆ తరువాత వయసు సహకరించదు.. అంతా బాగున్నా కూడా ఏదో ఒక కారణంతో వెళ్లలేని వారు కొందరుంటారు. అలాంటి వారి కోసమే ఈ న్యూస్. వారి కోసం బద్రీనాథుడే హైదరాబాద్‌కు వచ్చేశాడు. ఇటీవలి కాలంలో హైదరాబాద్ ప్రాంతంలో నూతన బద్రీనాథ్ ఆలయాన్ని నిర్మించారు. ఇది అచ్చుగుద్దినట్టుగా బద్రీనాథ్ ఆలయం మాదిరిగానే ఉంటుంది. ఉత్తరాఖండ్ లో ప్రసిద్ధి చెందిన అసలు ఆలయానికి ప్రతిరూపంగా ఈ బద్రీనాథ్ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి 40 కి.మీ దూరంలో మేడ్చల్ జిల్లా, బండమైలారం అనే చిన్న గ్రామంలో ఉంది.
దక్షిణ బద్రీనాథ్ ఆలయంగా దీనిని పిలుస్తున్నారు. స్వామివారి ప్రతిమలు సైతం సాక్షాత్తు ఆ బద్రీనాథుడినే అచ్చు గుద్దినట్టుగా పోలి ఉన్నాయి. ఈ ఆలయంలో ఇవాళ్టి నుంచి పూజలు ప్రారంభం కానున్నాయి. బద్రీనాథ్ క్షేత్రంలో పూజలు చేసినట్టుగానే ఇక్కడ కూడా చేస్తారు. ఉత్తరాఖండ్ కల్యాణకారి సంస్థ ఈ ఆలయాన్ని నిర్మించింది. 1,550 చదరపు గజాలలో దాదాపు 30,000 మంది ఎన్జీవో సభ్యులతో ఈ నిర్మాణం రూపుదిద్దుకుంది. ఈ ఆలయ నిర్మాణం కోసం దాదాపు కోటి రూపాయల విరాళాలు వచ్చాయట. ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయం సంవత్సరానికి నాలుగు నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది.
