ఏప్రిల్ 1వ తేదిన ఒంటిమిట్టలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం ఏర్పాట్లపై శనివారం టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి కడప జిల్లా కలెక్టర్ శ్రీ చెరుకూరి శ్రీధర్, టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ శ్రీ సచికేత్ విశ్వనాథ్, టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కళ్యాణోత్సవం సందర్భంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనున్న నేపథ్యంలో కళ్యాణ వేదిక, హెలిప్యాడ్, ఆలయం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అదనపు ఈవో, జిల్లా కలెక్టర్ కలిసి టీటీడీ, జిల్లా అధికారులతో ఆలయ సమీపంలో ఉన్న సమావేశ మందిరంలో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో అధికారులతో మాట్లాడుతూ అధికారులందరూ సమన్వయం చేసుకుని సమిష్టిగా పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. భక్తులకు ఎలాంటి సమస్య తలెత్తకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ సమర్థవంతంగా పని చేయాలని చెప్పారు. ఏర్పాట్లపై భక్తుల నుండి విభాగాల వారీగా అభిప్రాయాలు సేకరిస్తామని తెలిపారు. ప్రతి చిన్న సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కార్యాచరణ సమర్థవంతంగా ఉండేలా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ శ్రీ సీతారాముల కళ్యాణాన్ని విజయవంతం చేయాలని తెలియజేశారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, పోలీసు, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్, వైద్య, ఏపీఎస్ఆర్టీసీ, ప్రజా సంబంధాల శాఖ తదితర వివిధ విభాగాల అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కళ్యాణోత్సవానికి పూర్తి సన్నద్ధతతో సమాయత్తంగా ఉండాలన్నారు. ఎండ తీవ్రతకు భక్తులు డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉండటంతో వైద్యులు ముందు జాగ్రత్తగా అందుకు తగిన విధంగా మందులు, అంబులెన్సులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. భక్తులకు అన్న ప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేసేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
