Site icon Bhakthi TV

సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా.. లాభాలెన్నో తెలిస్తే..

‘సూర్యుడు ఆరోగ్య ప్రదాతగా చెబుతారు. నిత్యం ఉదయాన్ని సూర్యునికి అర్ఘ్యమిస్తే చాలా లాభాలున్నాయి. అంతేకాదండోయ్.. నిత్యం సూర్య నమస్కారాలు చేస్తే కలిగే ఫలితాన్ని ఊహించలేరు. సూర్య నమస్కారం అనేది పేరు ఒక్కటే అయినా లాభాలు మాత్రం అనేకం. సూర్య నమస్కారాసనాల కారణంగా ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. ఇవి 12 ఆసనాలు. ఒక్కొక్క ఆసనం కారణంగా ఒక్కో ప్రయోజనం చేకూరుతుంది. పన్నెండు చేస్తే ఒక వృత్తం పూర్తయినట్లు.వీటిలో ఒకటి నుంచి ఐదు… ఎనిమిది నుంచి పన్నెండు ఆసనాలు ఒకేలా ఉంటాయి. కుడి, ఎడమల తేడా మాత్రమే ఉంటుంది. ఏ ఆసనంతో ఎలాంటి లబ్ధి చేకూరుతుందో చూద్దాం…

ఒకటి, పన్నెండు : శరీర సమతుల్యత సాధించవచ్చు. శ్వాసకోశ వ్యవస్థ మెరుగుపడుతుంది. వెన్నెముక, మెడ, భుజాల దగ్గర ఉన్న కండరాలు బలోపేతం అవుతాయి.

రెండు, పదకొండు : జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వెన్నెముక, పిరుదులు బలోపేతమవుతాయి.

మూడు, పది : రక్త ప్రసరణ పెంచుతాయి. కాలి కండరాలను బలోపేతం చేస్తాయి. గ్రంధులపై కూడా ప్రభావం చూపుతాయి.

నాలుగు, తొమ్మిది : వెన్నెముక, చేతి మణికట్టు కండరాలను బలోపేతం చేస్తాయి.

ఐదు, ఎనిమిది : గుండెను బలోపేతం చేస్తాయి. మెడ, భుజాల దగ్గర ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి.

ఆరో ఆసనం : మెడ, భుజాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఏడో ఆసనం : జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వెన్నెముక బలంగా మారడానికి ఉపకరిస్తుంది.

ఇవి మాత్రమే కాకుండా.. సూర్య నమస్కారాలతో ఎముకలు, కండరాలు బలోపేతమై ఆరోగ్యంగా ఉండటమే కాదు. మధుమేహం, బీపీ, గుండె జబ్బుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. సూర్య నమస్కారాలలో 12 రకాల భంగిమలు ఉంటాయి. వీటిలో కొన్నింటిని నెమ్మదిగా చేయాలి. మరి కొన్నింటిని వేగంగా చేయాలి. వేగంగా చేసే భంగిమల్లో కండరాలకు మేలు జరుగుతుంది. ఏరోబిక్స్‌తో సమానమైన ఫలితాలు సాధించవచ్చు. నెమ్మదిగా చేసే సూర్య నమస్కారాలు శ్వాస నియంత్రణకు ఉపయోగపడతాయి.

Share this post with your friends
Exit mobile version