Site icon Bhakthi TV

వయోవృద్ధుల దర్శనంపై పుకార్లను నమ్మవద్దు : టీటీడీ

వయోవృద్ధుల దర్శనానికి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పుకార్లు వినవస్తున్నాయి. ఇవి తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టికి వెళ్లడంతో తాజాగా ఈ పుకార్లపై టీటీడీ స్పందించింది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వయోవృద్ధుల దర్శనానికి సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయని… ఇవి పూర్తిగా అవాస్తవమని ఎవరూ నమ్మవద్దని టీటీడీ కోరింది. వాస్తవం ఏమిటంటే, ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ ప్రతి నెల 23 మధ్యాహ్నం 3 గంటలకు మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోంది.

టికెట్ పొందిన వ్యక్తికి రూ.50/- ఒక లడ్డూ ఉచితంగా లభిస్తోంది. తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్/పిహెచ్‌సి లైన్ ద్వారా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. కావున సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఇలాంటి తప్పుడు వార్తలు లేదా వదంతులను నమ్మవద్దని టీటీడీ భక్తులకు మరోమారు విజ్ఞప్తి చేసింది. భక్తులు సరైన సమాచారం కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org, https://ttdevastanams.ap.in ను మాత్రమే సంప్రదించాలని కోరింది.

Share this post with your friends
Exit mobile version