
తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం గురించి వినే ఉంటారు.ఈ ఆలయంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారికి భారీ కానుక అందింది. తిరుపతికి 110కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ఆలయం. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం సమీపంలోని తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి బంగారు కిరీటం విరాళంగా అందింది. చెన్నైకి చెందిన శ్రీమతి వసంత లక్ష్మి, ఆమె కుమార్తె శ్రీమతి మాధవి, అల్లుడు శ్రీ మనోహర్ లు రూ.27 లక్షల విలువైన బంగారు కిరీటాన్ని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి కానుకగా సమర్పించినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది.
341 గ్రాములతో ఈ కిరీటాన్ని తయారు చేయించారు. స్వామివారికి కిరీటం సమర్పించిన అనంతరం దాతలకు స్వామివారి దర్శనం కల్పించారు. దర్శనానంతరం దాతలకు పండితులు వేదశీర్వచనం చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆలయ సూపరింటెండెంట్ శ్రీ ముని బాల కుమార్, ఆలయ ఇన్స్పెక్టర్ శ్రీ డి కృష్ణమూర్తి, అసిస్టెంట్ శ్రీ నాగరాజు, ఆలయ అర్చకులు శ్రీ గోపాల భట్టార్, శ్రీ కృష్ణ ప్రసాద్ భట్టార్, శ్రీ గోకుల్, శ్రీ అనిల్ కుమార్ విరాళాన్ని స్వీకరించారు.
