Site icon Bhakthi TV

సుదాముడికి ప్రపంచంలోనే ఏకైక ఆలయం ఎక్కడుందో తెలుసా?

శ్రీకృష్ణుడి స్నేహితుడు అనగానే మనకు సుధాముడు గుర్తొస్తాడు. సుధాముడికి కూడా ఒక ఆలయముందని తెలుసా? ఆయన పుట్టిన గ్రామంలోనే ఆయనకో ఆలయం ఉంది. గుజరాత్ పోర్ బందర్ తాలూకాలో ఓ గ్రామంలో సుధాముడు జన్మించాడు. ఆ ప్రాంతాన్ని సుదామపురిగగా పేర్కొంటారు. శ్రీకృష్ణుని లీలలు చూసి తరించేందుకు గానూ నారదుడే సుదాముడిగా జన్మించాడని చెబుతారు. సుదాముడు మధు, కారోచన దంపతులకు జన్మించాడు. సుదామపురిలో 12-13 శతాబ్దాల మధ్య సుదామ ఆలయ నిర్మాణం జరిగింది. సుదాముడికి ఉన్న ప్రపంచంలోనే ఏకైక ఆలయం ఇదే కావడం విశేషం.

రాజస్థాన్‌కు చెందిన రాజవంశీయులు ఎక్కువగా ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. వివాహమైన తర్వాత రాజ వంశీకుల కొత్త దంపతులు సుదాముని ఆలయానికి వచ్చి పూజలు నిర్వహించడం ఆచారంగా వస్తోంది. ఇక ఈ ఆలయంలోని గర్భగుడిలో సుదాముడితో పాటు శ్రీకృష్ణుడూ కొలువై ఉంటాడు. ఈ ఆలయానికి వెళ్లగానే తొలుత ప్రవేశ ద్వారం వద్ద ద్వారపాలకుల విగ్రహాలు మనకు స్వాగతం పలుకుతాయి. ఆపై 50 స్తంభాలతో నిర్మించిన మహామండపం.. దీనిని దాటుకుని వెళితే గర్భగుడిలో సతీ సమేతంగా సుధాముడు.. కుడిపక్కన శ్రీకృష్ణుడు ఉంటారు. ఆలయానికి చుట్టూ నందనవనం.. అప్పట్లో సుదాముడు ఉపయోగించిన బావి దర్శనమిస్తాయి. అక్షయ తృతీయ రోజున కుచేలుని దినంగా భావించి పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు.

Share this post with your friends
Exit mobile version