
శ్రీశైలంలో ఉండే భ్రమరాంబికా అమ్మవారి దేవాలయానికి వెళుతుంటాం కానీ కొన్ని విషయాలను మాత్రం గమనించం.అమ్మవారి ఆలయానికి వెనకాతల నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వెళ్లి చెవిని బాగా నొక్కిపెట్టి ఉంచి చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకుని వింటే ఒక తుమ్మెద చేసిన ఝుంకారము వినపడుతుంది. దానిని భ్రమరీ నాదము అంటారు. అమ్మవారిని ఇప్పటికీ అక్కడ తుమ్మెద రూపంలో ఉన్న రెక్కలతో అలంకారం చేస్తారు. ఆ తల్లిముందు శంకరాచార్య స్వామి వారు శ్రీచక్రములను వేశారు.
అక్కడికి వెళ్లి అమ్మవారి శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లి అయినా కుంకుమార్చన చేస్తే కలిగే ప్రయోజనమే వేరు. కుంకుమార్చన చేసిన స్త్రీ పూర్ణంగా మూడు తరములు చూసి హాయిగా పదిమంది చేత పండు ముత్తైదువ అని అనిపించుకుని వార్ధక్యంలో హాయిగా ఆవిడ భర్తగారి తొడమీద తల పెట్టుకొని ప్రాణం విడిచిపెట్టగలిగిన అదృష్టం కలుగుతుందని చెబుతారు. శ్రీశైల లింగమునకు పట్టు తేనెతో అభిషేకం చేస్తే ఉత్తర జన్మలలో గంధర్వగానం వస్తుంది. భ్రమరాంబికా అమ్మవారి దగ్గర కూర్చుని కుంకుమార్చన చేసుకోవాలి. నాలుగు మారేడు దళములు పట్టుకెళ్ళి ఆ శివలింగమును తడిమి తడిమి అభిషేకం చేసుకోవాలి. తల తాటించి నమస్కరించుకోవాలి.
