Site icon Bhakthi TV

దేవస్నాన పూర్ణిమ అంటే ఏంటో తెలుసా?

సాక్షాత్తుగా నారాయణుడే జగన్నాథునిగా, లక్ష్మీదేవి సుభద్రాదేవిగా, ఆదిశేషుడు బలభద్రునిగా – దివ్య దారుమూర్తులుగా ప్రత్యక్షంగా ప్రకటితమైన స్థలమే పురుషోత్తమ క్షేత్రం. ఏ క్షేత్రంలోనైనా మూలవిరాట్టుకు నిత్యాభిషేకమో, వారాభిషేకమో నిర్వహిస్తుంటారు. పూరీ జగన్నాథుని ఆలయం సంస్కృతి, ఆచార వ్యవహారాలు చిత్రంగా ఉంటాయి. పూరీలో కొలువై ఉన్న జగన్నాథునికి మాత్రమే ఏడాదికొక్కరోజు మాత్రమే అభిషేకం చేస్తారు. ప్రతీ ఏటా జ్యేష్ఠపూర్ణిమ రోజున జగన్నాథునికి నిర్వహించే అభిషేకాన్నే దేవస్నాన పూర్ణిమగా వ్యవహరిస్తారు.

ఇతర క్షేత్రాలకు భిన్నంగా పూరీలోని మూలవిరాట్టులు దారుతో చేసినవి. అంటే వేప చెక్కతో మలచిన శిల్పాలు. దారుమూర్తులను నిత్యం అభిషేకిస్తే పాడవుతాయి గనుక, నిత్య కైంకర్యాల్లో భాగంగా స్వామివారి ఎదుట అద్దం ఏర్పాటు చేసి, ఆ అద్దంలో కనిపించే ప్రతిబింబానికే అభిషేకం చేస్తారు. దీన్నే దర్పణ స్నానంగా వ్యవహరిస్తారు. జ్యేష్ఠపూర్ణిమ రోజున మాత్రం మూలమూర్తికి ఆపాదమస్తకం పవిత్రజలాలతో అభిషేకం చేస్తారు. గర్భాలయంలో కొలువై ఉన్న జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలకు ఆలయ ప్రాకారంలోని స్నానవేదికపై అభిషేకం నిర్వహించే వేడుక అత్యంత విశేషమైనదిగా భక్తులు భావిస్తారు.

Share this post with your friends
Exit mobile version