Site icon Bhakthi TV

జగన్నాథుడు, సుభద్ర, బలబద్రుడి రథాలకు ఏమేం పేర్లో తెలుసా?

“రథస్థం వామనం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే” అని స్మృతివచనం.

రథ మందున్న వామనుని చూస్తే పునర్జన్మ ఉండదని భావం.

శరీరాన్ని రథంతో పోల్చాయి ఉపనిషత్తులు, ఇంద్రియాలు గుర్రాలుగా, బుద్ధి శక్తులు పగ్గాలుగా నడిచే రథం ఈ శరీరం. నడిచే రథాన్ని చూస్తున్నాం గానీ – నడిపే రథిని దర్శించాలి. అతడే పరమాత్మ. రథ సదృశమైన దేహమే నేను – అనే భ్రాంతిని వదిలి, దీనికి మూలమైన పరమాత్మ చైతన్యంతో ఈ ‘నేను’ తాదాత్మ్యం చెందితే… అతడే జ్ఞాని, అతడి జీవితమే నిజమైన రథయాత్ర. రథాన్నీ, తిరిగే ప్రపంచాన్నీ మాత్రమే చూసే చూపును దాటి రథంలోనున్న మూల చైతన్యాన్ని (ఆత్మను) గ్రహించే ఆత్మజ్ఞానం పొందినవాడు మోహాల వలయంలో చిక్కు కోడు. రథస్థ వామన దర్శన మంటే అదే.

‘వామను’డంటే సూక్ష్మస్వరూపుడు. స్థూలమైన దేహ రథంలో అత్యంత సూక్ష్మంగా భాసించే జగన్నాథుడే వామనుడు. కేవలం శరీర రథంలోనే కాదు, విశ్వరథంలో విరాజిల్లేది కూడా విష్ణువే. ఒక రథంలా సూర్యచంద్ర గ్రహాది ఉపకరణాలతో తయారైనది ఈ విశ్వం. వేటికవి వేరైనా రథమంతా కలిపి ఒకటి. విశ్వంలో కూడా విడివిడిగా వివిధ ప్రత్యేకతలు గోచరించినా, అన్నీ ఒక దానితో ఒకటి సూక్ష్మమైన, బలీయమైన సంబంధం కలవి. అవన్నీ కలిపి ఒకే విశ్వ రథం. వీటన్నిటినీ నడుపుతున్న మహా చైతన్యమే విశ్వవిభుడు – జగన్నాథుడు. మన తీర్థ క్షేత్రాలలో, ఉత్సవాలలో అందిరినీ అలరించే వేడుకలతోపాటు, ఆలోచించ గలిగే అంతర్ముఖులకు ఆత్మదర్శనం చేయించే తత్త్వం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

పూరీలోని మూడు రథాలలో జగన్నాథుని రథానికి ‘నంది ఘోష’ అనీ, ‘గరుడధ్వజ’ అనీ పేర్లు. సుభద్ర రథానికి ‘దర్పదళన’ అనీ, ‘పద్మధ్వజ’ అనీ పేర్లు. బలభద్రుని రథానికి ‘తాళధ్వజ’ అని పేరు. వీటి అశ్వాలకీ, ధ్వజాలకీ సంఖ్యలోనూ, నామాలలోనూ కూడా మంత్ర, దేవతా సంకేతాలు ఉన్నాయి. స్థూల సూక్ష్మ కారణ శరీరాలలో – జాగ్రత్ స్వప్న సుషుప్తులలో- భూత భవిష్యద్వర్తమానాలలో వ్యాపించిన విష్ణు చైతన్యాన్ని అవగాహన చేసుకోవడమే మూడు రథాలలోని ముమ్మూర్తుల సాక్షాత్కారం.

Share this post with your friends
Exit mobile version