Site icon Bhakthi TV

మనోహరమైన దత్తాత్రేయుని కథ గురించి తెలుసా?

మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజు జరుపుకునే దత్త జయంతి రోజు దత్తాత్రేయుని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటాం. అసలు ఎవరీ దత్తాత్రేయుడు? అనే విషయం ముందుగా తెలుసకుందాం. ఇవాళ దత్తాత్రేయుని అవతారం సంభవించిందట. త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయుడు జన్మించాడట. ఇవాళ దత్తాత్రేయుని పూజించుకుంటే ముక్కోటి దేవతలను పూజించినట్టేనని చెబుతారు. వారందరి అనుగ్రహం మనపై ఉంటుందట. ఈ దత్తాత్రేయుడు అనసూయ, అత్రి మహర్షుల కుమారుడని తెలుసు. కానీ ఆయన అవతార గాథ గురించి చాలా మందికి తెలియదు. వాస్తవానికి దత్తాత్రేయ స్వామి అవతార గాథ చాలా మనోహరంగా ఉంటుంది.

నారదుల వారు ఏం చేసినా దాని వెనుక లోక కళ్యాణం పరమార్థం ఉంటుంది. ఈ క్రమంలోనే ఒకసారి నారదుడు లోకకళ్యాణార్థం కోసం చేసిన మాయలో భాగంగా అనసూయ మాత పాతివ్రత్యాన్ని గురించి లక్ష్మి, సరస్వతి, పార్వతి దగ్గర చాలా గొప్పగా చెప్పాడంట. తమ ముందే వేరొక మహిళను గొప్పగా కొనియడాడుతుండటంతో ఆ ముగ్గురూ అకారణంగా అనసూయపై అసూయ పెంచుకున్నారట. దత్తాత్రేయుని జననం కోసం నారదుడు ఇదంతా చేశాడు. అసూయతో ముగ్గురు దేవతలను తమ భర్తలను అనసూయ ఆశ్రమానికి ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగించమని పంపారట. సతుల మాట కాదనలేక సన్యాసుల వేషంలో త్రిమూర్తులు అత్రి, అనసూయ ఆశ్రమానికి వెళ్లారు. వారిని చూసిన అత్రి దంపతులు సాదర స్వాగతం పలికి భోజన ఏర్పాట్లు చేశారట. ముగ్గురూ భోజనానికి ఆశీనులై వడ్డించడానికి ముందు అనసూయ వివస్త్రయై వడ్డిస్తే తప్ప భోజనం చేయమని కండీషన్ పెట్టారు.

అనసూయ పాతివ్రత్య మహత్యంతో వారు త్రిమూర్తులని గ్రహించి తన పాతివ్రత్యం కోల్పోకుండా అలాగే అతిథి సేవ కోసం పతికి నమస్కరించి కమండలోదకమును త్రిమూర్తుల శిరస్సుపై చల్లింది. అంతే ఆ ముగ్గురూ పసిపిల్లలుగా మారిపోయారు. ఆ ముగ్గురికి అనసూయ పాలు పట్టించి ఆకలి తీర్చి నిద్రపుచ్చింది. భర్తల ఆచూకీ తెలియక లక్ష్మీ, సరస్వతి, పార్వతీదేవిలు నారదుని నుంచి విషయం తెలుసుకున్నాయి. వారిలో అసూయ ద్వేషాలు తొలగిపోయాయి. అత్రి మహర్షి ఆశ్రమానికి చేరుకుని అనసూయను పతి భిక్ష పెట్టమని వేడుకున్నారు. తిరిగి త్రిమూర్తులను అనసూయ సాధారణ స్థితికి తీసుకొచ్చింది. తమకు మాతృ ప్రేమను పంచిన అనసూయను ఏం కావాలో కోరుకోమని త్రిమూర్తులు అడగ్గా.. మీరు మాకు పుత్ర వాత్సల్యాన్ని ఇచ్చారు కాబట్టి ఆ వరం శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించమని అనసూయ కపోపరింది. మీ పుత్ర వాత్సల్యానికి మీకు మేము ముగ్గురం దత్తమవుతున్నాము. మీ కీర్తి ఆచంద్రతారార్కం కాగలదని వరమిచ్చారు. అలా దత్తాత్రుయుడు జన్మించాడు.

Share this post with your friends
Exit mobile version