Site icon Bhakthi TV

వకుళాదేవి గురించి తెలుసా? ఆమె ద్వాపరయుగంలో ఎవరంటే..

తిరుమలలోని ఆనంద నిలయంలో ఉన్న శ్రీవారిని బంగారు వాకిలి వద్ద నుంచి దర్శించి.. మండపం దాటాక బంగారు బావి పక్కగా మెట్లేక్కి అన్నప్రసాదాలు తయారు చేసే పోటులో అడుగు పెట్టగా కనిపించే తల్లి వకుళాదేవి. తమిళంలో ఈ తాయారును మడప్పళ్ నాచ్చియార్ అంటారు. మడప్పల్లి అంటే వంటశాల.. నాచ్చియార్ అంటే అమ్మవారు. అసలు ఈ వకుళ మాత ఎవరంటే.. శ్రీనివాసుని పెంపుడు తల్లి వకుళాoబ. ఈమె ద్వాపరయుగంలో యశోదా దేవి. ద్వాపర యుగంలో తల్లి యశోదకు శ్రీకృష్ణుడు ఇచ్చిన వర ఫలితంగానే కలియుగంలో శ్రీనివాసుడుగా అవతరించి వకుళాదేవి చేతుల మీదుగా శ్రీ విష్ణు భగవానుడు వివాహం జరిపించుకున్నాడట.

పొత్తిళ్ళ నుంచి శ్రీకృష్ణుడిని పెంచి పోషించిన మాతృమూర్తి యశోదాదేవి. చిన్నప్పటి నుంచి ఎందరో రాక్షసులనను సంహరించిన శ్రీకృష్ణుడి లీలల్ని, మహిమల్ని కనులారా చూసి ఆనందించింది యశోదాదేవి. అయినా యశోదకు తనివి తీరలేదు. చిన్నారి కన్నయ్యను ఏ ఆపద కలుగుతుందోనని నిరంతరం బాధలు పడుతూ అష్టకష్టాలు పడి పెంచి పెద్ద చేసింది యశోద . అయితే కంసుని వథ అనంతరం ఆ శ్రీకృష్ణుడు తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల చెంతకు చేరాడు. తల్లిదండ్రుల దగ్గరే శ్రీకృష్ణుడి వివాహాది కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. చిన్నప్పటి నుంచి పెంచి పెద్దచేసిన తాను శ్రీకృష్ణుడికి వివాహాన్ని స్వయంగా చేసి సంతోషించే భాగ్యానికి నోచుకోలేదు కదాని చింతిస్తున్న యశోదమాత మనస్సును తెలుసుకున్న శ్రీకృష్ణ పరమాత్మ.. నన్ను పెంచి పోషించినందుకు స్వయంగా నీవే నాకు వివాహాన్ని చేసి సంతోషించే భాగ్యాన్ని కలిగిస్తున్నానంటూ అభయమిచ్చాడు.

Share this post with your friends
Exit mobile version