
తమిళనాడులో రామేశ్వరంలో రామనాథ స్వామి ఆలయాన్ని తిలకించిన మీదట సందర్శించాల్సిన కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మరికొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం. రామేశ్వరంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన తీర్థాల్లో విల్లుండి తీర్థం ఒకటి. ఇది అత్యంత ప్రసిద్ధిగాంచిన స్థలం. దీనిని ‘సముద్రం మధ్యలో ఉన్న తీపి నీటి బావి’ అని కూడా పిలుస్తారు. అసలు సముద్రంలో బావి ఎలా ఉంది? అనే సందేహం రావొచ్చు. సీతాదేవి దాహం తీర్చడానికి రాముల వారే సముద్రంలో తన విల్లుతో బావిని తవ్వారట. ఇది రామేశ్వరం బస్టాండ్ నుంచి 6 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ త్రయంబకేశ్వరంగా పిలవబడే ఒక చిన్న శివాలయం ఉంది.
రామేశ్వరం ద్వీపంలోని పాక్ బే ఒడ్డున ఒక అందమైన బీచ్ ఉంది. దానిని అరియామన్ బీచ్ లేదంటే కుషి బీచ్ అని కూడా పిలుస్తారు. రామేశ్వరం నుంచి దాదాపు 27 కి.మీ దూరంలో ఉండే ఈ బీచ్లో ప్రశాంతమైన అలలు, ఇసుక తీరాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక రామేశ్వరం నుంచి దాదాపు 20 కి.మీ దూరం వెళితే పంబన్ వంతెన ఉంటుంది. ఇది మన దేశంలోనే మొట్టమొదటి నిలువు లిఫ్ట్ వంతెన. దీని చుట్టూ ఉన్న దృశ్యాలు.. ఇక్కడి గాజు పడవలో ప్రయాణం.. సూర్యాస్తమయ దృశ్యం మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక రామేశ్వరం వెళ్లిన వారు తప్పక చూడాల్సిన ప్రదేశం సీ వరల్డ్ అక్వేరియం. రామేశ్వరం బస్టాండ్ ఎదురుగానే ఉంటుంది. ఇక్కడ జలచరాలన్నింటినీ మనం చూడవచ్చు. అయితే ఆదివారాలతో పాటు రెండవ శనివారం ఇది మూసివేసి ఉంటుంది.
