హనుమత్ రుద్ర శక్తి అంటే హనుమంతుడు రుద్ర స్వరూపం అన్నమాట. ఆంజనేయ స్వామి కేవలం భక్తాగ్రగణ్యుడే కాదు, సాక్షాత్తు ఆ పరమశివుని రుద్రాంశ సంభూతుడు. ఇది హిందూ సాంప్రదాయంలో అత్యంత బలమైన, రక్షణ కల్పించే దైవిక శక్తిగా పరిగణించబడుతుంది. హనుమంతుడిని శివుడి 11వ రుద్రావతారంగా భావిస్తూ ఉంటారు. అందకే హనుమత్ రుద్ర శక్తి అని పేర్కొంటారు. శివుని దివ్య శక్తులతో పాటు రుద్రుని సంకల్ప శక్తి హనుమంతుడిలో నిక్షిప్తమై ఉన్నాయని చెబుతారు. హనుమత్ రుద్ర శక్తి భయం, నెగటివ్ శక్తులు, కర్మ సంబంధిత అడ్డంకులను తొలగిస్తుంది. శత్రు సంహారంతో పాటు రక్షణ, శత్రువులపై విజయం సాధించడానికి, భయాలను దూరం చేసుకోవడానికి ఈ శక్తిని ఆరాధిస్తారు.
రోగ నివారణకు సైతం హనుమత్ రుద్ర శక్తిని పూజిస్తారు. రుద్ర స్వరూపమైన హనుమంతుని పూజించడం వల్ల రోగాలు నయమవుతాయని నమ్మకం. శక్తివంతమైన హనుమత్ రుద్ర మంత్రం ఏంటంటే.. “ఓం హం హనుమతే రుద్రాత్మకాయ హుం ఫట్”.. ఈ మంత్రాన్ని పఠిస్తే మనలోని భయాన్ని పోగొట్టి, ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మరో మంత్రం ఏంటంటే.. “ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రుసంహరణాయ సర్వరోగ హరాయ సర్వవశికరణాయ రామదూతాయ స్వాహా”. ఈ మంత్రాన్ని పఠిస్తే శత్రు నాశనంతో పాటు సకల కార్యసిద్ధి కలుగుతుంది. ఈ మంత్రాలను జపించడం వల్ల జీవితంలో నిస్తేజం తొలగి, దైవిక ఉత్సాహం, రక్షణ లభిస్తుందని భక్తుల నమ్మకం.
