Site icon Bhakthi TV

ద్వాదశ జ్యోతిర్లింగాలలో చివరి దాని గురించి తెలుసా?

జ్యోతిర్లింగాలకు ఎంతటి ప్రాధాన్యత ఉందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గృహణేశ్వర్ జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో చివరిది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా (ప్రస్తుతం ఛత్రపతి సంభాజీ నగర్)లోని వేరుళ్ గ్రామంలో, ప్రసిద్ధ ఎలోరా గుహల పక్కన ఈ ఆలయం ఉంది. ఇది భక్తులకు శివక్షేత్రయాత్రలో తుది పుణ్యసంపూర్ణం చేసే స్థలంగా భావించబడుతుంది. ఈ ఆలయ ప్రాముఖ్యత ఏంటంటే.. ద్వాదశ జ్యోతిర్లింగాలలో చివరిది కావడంతో, శివుని అనుగ్రహం సంపూర్ణంగా పొందే క్షేత్రంగా గృహణేశ్వర్ ప్రసిద్ధి చెందింది. భక్తులు జ్యోతిర్లింగ యాత్రను ఇక్కడ దర్శనంతో పూర్తి చేసినట్లు భావిస్తారు.

దేవాలయ నిర్మాణం, శిల్పకళ చూపరులను కట్టిపడేస్తుంది. ఎర్రరాయితో నిర్మించబడిన ఈ ఆలయం ఐదు అంతస్థుల గోపురంతో (శిఖరం) ప్రత్యేకంగా నిలుస్తుంది. లోపల గర్భగృహం, అంతర్గత మండపాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఆలయంలోని 24 స్తంభాలపై శివుని పురాణ గాథలు చెక్కబడి ఉన్నాయి. ఆలయ సముదాయంలో విష్ణుమూర్తికి చెందిన దశావతార శిల్పాలు, అలాగే శివుని వాహనమైన నంది విగ్రహం ఉన్నాయి. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే.. శ్రీశైలంలో మాదిరిగానే ఇక్కడ కూడా భక్తులకు స్పర్శ దర్శనం ఉంది. అంటే భక్తులు నేరుగా శివలింగాన్ని స్పర్శించగలిగే అవకాశం ఇక్కడ లభిస్తుంది.

Share this post with your friends
Exit mobile version