Site icon Bhakthi TV

భౌమ, వాయువ్య, దివ్య, మానసిక స్నానాల గురించి తెలుసా?

స్నానం అంటే ఏంటో తెలుసుకున్నాం. అలాగే కొన్ని రకాల స్నానాల గురించి కూడా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు భౌమ, వాయువ్య, దివ్య, మానసిక స్నానాల గురించి తెలుసుకుందాం.

భౌమస్నానం: పుణ్య నదులలో దొరికే మన్ను లేక పుట్ట మన్ను మొదలైన పవిత్ర మృత్తికను ఒంటి నిండా అలముకొని మృత్తికా మంత్రములతో చేసేది ‘భౌమ స్నానం’. దీనినే మడ్ బాత్ అంటారు. పంచభూతాల్లో మట్టి ఒకటి. మనం కాలు మోపాలన్నా, మనకు సర్వాన్నీ ప్రసాదించే చెట్టుచేమలను పెంచాలన్నా మట్టే కదా అవసరం. మట్టి లేకపోతే మనకు మనుగడే లేదు. పుట్టింది మొదలు, చనిపోయేవరకూ మట్టితో మనకు విడదీయరాని సంబంధం ఉంటుంది. చివరికి తుది శ్వాస విడిచిన తర్వాత ఈ శరీరం మట్టిలోనే కలిసిపోతుంది. భస్మ స్నానం, మృత్తికా స్నానం పూర్తయిన తర్వాతనే క్రొత్త యజ్ఞోపవీతం వేసుకోవాలనేది శాస్త్రం. మట్టిలో ఎన్నో క్రిముల్ని సంహరించే శక్తితో పాటు గాయాలని మాన్పగల శక్తి కూడా ఉంది.

వాయవ్యస్నానం: ముప్పయి మూడు కోట్ల దేవతులు నివశించియున్న గోవులు నడుస్తుండగా వాటి కాళ్ళ నుండి రేగే మట్టి మన మీద పడేలా నడవడం. విభూతిని పెట్టుకోవడం, గోధూళిలో విహరించడం అనేవి పవిత్రమైన అంశాలుగా పద్మ పురాణం చెప్తోంది. గోధూళిలో ఉండే కమ్మటి వాసన మనకు అనుభవమే! అది శాస్త్రీయంగా కూడా ఎంతో మేలు చేస్తుంది.

దివ్యస్నానం: లోక భాంధవుడు, జగత్ చక్షువు, కర్మ సాక్షి అయినటువంటి సూర్య భగవానుడు ఆకాశంలో ఉండి సూర్య కిరణాలను వెలువరిస్తున్నపుడు వర్షం నీటిలో తడవడాన్నే దివ్య స్నానం అంటారు. అంటే, ఒక్కోసారి ఎంతమాత్రం మబ్బు పట్టకుండా ఎండలోనే వాన వస్తుంది కదా! అలాంటి వర్షంలో తడవడాన్ని దివ్య స్నానం అంటారు. ఇది చాలా అరుదైనది.

మానసిక స్నానం: అంటే మానసికంగా చేస్తాం తప్ప నిజంగా చేసే స్నానం కాదు. నిత్యం నారాయణ నామ స్మరణతో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య అహంకార ఢంభ దర్పదైన్యాది మాలిన్యాలను మనస్సులో చేరనీక పోవడం “మానస స్నానం”. ఇది మహత్తర స్నానం. మహా ఋషుల చేత ఆచరింప బడుతుంది. పైపై స్నానాలు కాకిస్నానాలు ఎన్ని చేసినా లోపలి దేహానికి కూడా చేయించినప్పుడే అది సంపూర్ణ స్నానం అవుతుంది.

ఖస్థితం పుండరీకాక్షం చింతయేత్ పురుషోత్తమం| అనంతాదిత్యసంకాశం వాసుదేవం చతుర్భుజం||
శంఖచక్ర గదా పద్మధారిణం వనమాలినం| ధ్వజ వప్ర అంకుశైర్లక్ష్య పాదపద్మం సునిర్మలం||
త్వత్పాదోదజాం గంగాం నిపతంతీం స్వమూర్ధని| చింతయేత్ బ్రహ్మరంధ్రేణ ప్రవిశంతీం స్వకాంతమం||
తయా సంక్షాళయే త్సర్వమంతర్దేహగతం మలం| తత్ క్షణాత్ విరజా మర్త్యో జాయతే స్ఫటికోపమ:||
ఇదం మానసికం స్నానం ప్రోక్తం హరిహరాదిభి:| సార్దత్రికోటి తీర్ధేషు స్నానాత్కోటి గుణాధికం||
యోనిత్యమాచరేద్దేవం సవియెనారాయణ స్మృత:| కాలమృత్యు మతిక్రమ్య జీవత్యేవ నసంశయ:||

అంటే పరమాకాశంలో ఉండే పురుషోత్తముడయిన వాసుదేవుడిని, నాలుగు భుజములు కలవాడిని, శంఖ చక్ర గద పద్మము వనమాలలను ధరించినవానిని, ధ్వజాదులనే మంగళకరమైన గుర్తులున్నవానిని ధ్యానించాలి. వాని పాద పద్మముల నుండి పుట్టిన గంగను తన శిరస్సుపై పడి బ్రహ్మరంధ్రం వెంబడి హృదయంలో ప్రవేశించే దానిగా భావించాలి. ఆ గంగచేత తన పాపలు పోతున్నట్లుగా చింతించాలి. అప్పుడు స్ఫటికం మాదిరిగా మలినాలు లేకుండా నిర్మలంగా ఉండి మృత్యువును దాటగలరు. ఇలా హరిహరులను తలుచుకుంటూ చేసే మానసిక స్నానం కోటి పుణ్య నదులలో చేసిన స్నానం కన్నా గొప్పది అని దీని భావము.

ఇడా భాగీరథీ గంగా, పింగళా యమునా స్మృతా| తయోర్మధ్యగతా నాడీ, సుషుమ్నాఖ్యా సరస్వతీ||
జ్ఞానహ్రదే ధ్యానజలే రాగద్వేష మలపహే| య:స్నాతి మానసే తీర్ధే సయాతి పరమాం గతిం||
అచ్యుతోహం అనంతోహం గోవిందోహం అహం హరి:| ఆనందోహం అశేషోహం అజోహం అమృతోస్మ్యహం||
నిత్యోహం నిర్వికల్పోహం నిరాకారోహం అవ్యయ:| సచ్చిదానందరూపోహం పరిపూర్ణోస్మి సర్వదా||
బ్రహ్మైవాహం నసంసారీ, ముక్తోహమితి భావయేత్| ఆశక్నువన్ భాపయితుం వాక్యమేతత్ సమభసేత్||
ఏవం య: ప్రత్యహం స్మృత్వా, మానసం స్నానమాచరేత్| సదేహాంతే పరబ్రహ్మపదం యాతి నసంశయ:||

ఎడమ ముక్కులోనున్న ఇడానాడిని భాగీరథిగా, కుడి ముక్కులో నున్న పింగళనాడిని యమునగా, వాటి మధ్యలో నున్న సుషుమ్నును సరస్వతిగా భావించాలి. రాగద్వేషాలనే మాలిన్యాన్ని పోగొట్టే జ్ఞానమనే సరస్సులో స్నానం చేసినట్లు భావించి నేనే అచ్యుతుడను, గోవిందుడను, హరిని, ఆనందరూపుణ్ణి, చావు పుట్టుకలు లేని పరమాత్మ స్వరూపాన్ని నేనే అని భావిస్తూ మనస్సులోనే స్నానం చేస్తున్నట్లుగా భావించి తరించాలి అని దీని భావము.

Share this post with your friends
Exit mobile version