
కొంతమంది రాహు, కేతు దోషాలతో బాధపడుతూ ఉంటారు. వారికి అమావాస్య చాలా ముఖ్యమైనది. ఆ రోజున కొన్ని పరిహారాలు చేస్తే దోషాల తీవ్రత తగ్గుతుందట. అసలు రాహు దోషం అంటే ఏంటంటే.. నవగ్రహాలలో ముఖ్యంగా చెప్పుకునే.. రాహు, కేతువులు.. ఛాయా గ్రహాలు. ఇవి కానీ జాతకంలో సరిగా లేకుంటే ఆ దోషం కారణంగా జీవితంలో అనేక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పౌర్ణమి మాదిరిగానే అమావాస్యకూ ప్రత్యేకత ఉంది. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు. అలాగే రాహు, కేతు దోష నివారణకు సైతం అమావాస్య చాలా ప్రత్యేకమైనది.
అమావాస్య నాడు కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటిస్తే రాహు, కేతు దోషాల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతారు. పితృదేవతలకు భోజనం పెడితే ఈ దోషం నుంచి విముక్తి లభిస్తుందట. ఇలా చేస్తే పూర్వీకుల ఆశీర్వాదాలతో పితృ దోషాలతో పాటు రాహు, కేతు దోషాలు కూడా తగ్గుతాయట. ఈ రోజున బ్రాహ్మణులకు అన్నదానం చేసినా చాలా మంచిదని చెబుతారు. ముఖ్యంగా నువ్వులు, బెల్లం, నల్లని వస్త్రాలు దాం చేస్తే చాలా మంచిదట. రాహు, కేతువులకు శివుడు అధిపతి కాబట్టి ఆయనను పూజించినా గ్రహాలు శాంతిస్తాయని నమ్మకం. కాబట్టి అమావాస్య రోజున శివాలయానికి వెళ్లి అభిషేక ప్రియుడైన శివయ్యను పూజిస్తే దోష ప్రభావం తగ్గుతుందట.
