Site icon Bhakthi TV

శ్రీవారి ఆలయంలో బంగారువాకిలి చెంత ఆగమోక్తంగా ఆస్థాన వేడుక

తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో బంగారువాకిలి చెంత ఆగమోక్తంగా ఆస్థాన వేడుకను నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఈవో శ్రీ జె.శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించిట్లు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్టు చెప్పారు. ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఈవో ఆకాంక్షించారు.

శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ భక్తులందరికీ శ్రీవారి ఆశీస్సులు అందాలని కోరుతూ దీపావళి ఆస్థానం నిర్వహించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు నూతన పట్టువస్త్రాలు అలంకరించినట్టు తెలిపారు. అంత‌కుముందు ఆల‌యంలో మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలు సమర్పించి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. సాయంత్రం స్వామి, అమ్మ‌వార్లు సహస్ర దీపాలంకరణ ‌సేవ‌లో పాల్గొని ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు.

Share this post with your friends
Exit mobile version