Site icon Bhakthi TV

తిరుమల తరహలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం అభివృద్ధి: టీటీడీ ఈవో

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం తరహలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు వెల్లడించారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఈవో గురువారం అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, భక్తుల సౌకర్యార్థం జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. ఆలయంలో ప్రస్తుతం ఉన్న ఐనామహల్, యాగశాల, పోటు, ప్రసాదాల పంపిణీ కౌంటర్‌ను పరిశీలించారు.

ఆలయంలో ఉన్న ఎలక్ట్రికల్ కంట్రోల్ రూమ్‌ను ఆలయం బయటకు మార్చేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతకు ముందు ఈవో శ్యామలరావు ఆలయం వెలుపల వున్న వాహన మండపం, ఆస్థాన మండపం కింద ఉన్న సెల్లార్, క్యూలైన్లు, పాత డిప్యూటీ ఈవో కార్యాలయం, ఆలయ నాలుగు మాడవీధలు, పద్మాసరోవరం తదితర పరిసరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈవో వెంట జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సీఈ శ్రీ నాగేశ్వరరావు, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version