Site icon Bhakthi TV

9 గ్రంథులతో పద్మావతి అమ్మవారి అలంకరణ.. 12 రకాల నైవేద్యాలు..

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరిగింది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. ఈ పర్వదినాన అమ్మవారు బంగారుచీరతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీ పద్మావతీ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆశీనులను చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోతర శత నామావళి నిర్వహించారు.

ఈ సందర్భంగా అమ్మవారిని రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరు ఆకు, మరువము, తామరపూలు, వృక్షి వంటి సాంప్రదాయ పుష్పలతో అమ్మవారిని ఆరాధించారు. ఈ సందర్భంగా అమ్మవారిని 9 గ్రంథులతో(నూలుపోగు) అలంకరించారు. ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా ఆరాధించారు. భవిష్యోత్తర పురాణంలో వ్యాస భగవానుడు వరలక్ష్మీ వ్రతం పూజావిధానాన్ని, మహత్యాన్ని తెలియజేశారని పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీ మణికంఠ స్వామి తెలిపారు. పూర్వం శంకరుడు పార్వతిదేవికి ఈ వరలక్ష్మీ వ్రతం విశిష్ఠత, అచరించవలసిన విధానాన్ని తెలియచేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. త్రేతాయుగంలో కుండలినీ నగరంలో నివసించిన చారుమతి అనే భక్తురాలు వరలక్ష్మీ నోము ఆచరించి పొందిన ఫలప్రదాన్ని ఈ సందర్భంగా వివరించారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ప్రీతితో అవతరించిన తిరుచానూరులో వరలక్ష్మీవ్రతంలో పాల్గొన్న మహిళలకు సత్సంతానం, దీర్ఘమాంగల్యసౌఖ్యం, సిరిసంపదలు, ఆరోగ్యం, కుటుంబసౌఖ్యం వంటి ఎన్నో మహాఫలాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు.

తరువాత 12 రకాల వివిధ నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు. అనంతరం మహా మంగళ హరతితో వరలక్ష్మీ వ్రతం ముగిసింది.ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ జె.శ్యామల రావు మీడియాతో మాట్లాడుతూ, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతాన్ని అత్యంత వైభవంగా నిర్వహించినట్లు చెప్పారు. మహిళలు పెద్ద సంఖ్యలో వ్రతంలో పాల్గొన్నట్లు తెలిపారు. వరాలు ప్రసాదించే అమ్మవారు కావడంవల్ల వరలక్ష్మీ వ్రతం అని పిలుస్తారని అన్నారు. ఈ వ్రతం ఆచరిస్తే అష్టలక్ష్ములను ఆరాధించిన ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసమన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక క్యూలైన్లు, అన్నప్రసాదాలు ఇతర ఏర్పాట్లు చేశామన్నారు. సాయంత్రం 6 గంటలకు స్వర్ణ రథంపై అమ్మవారు భక్తులను కటాక్షిస్తారని తెలిపారు.

Share this post with your friends
Exit mobile version