
ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని త్రియుగి నారాయణ్ ఆలయంలో చాలా విశేషాలున్నాయి. శివపార్వతుల వివాహం ఇక్కడ జరిగిందని ముందే తెలుసుకున్నాం కదా.. ఈ పెళ్లి సమయంలో వెలిగించిన హోమగుండం మూడు యుగాలుగా వెలుగుతూనే ఉందని చెబుతారు. అందుకే ఈ ఆలయాన్ని అఖండ ధుని ఆలయం అని కూడా పిలుస్తారు. పెళ్లి చేసుకోవాలనుకునే జంటలు ఇక చేసుకోవాలని భావిస్తారు. అలాగే యువతీయువకులు తమకు మంచి వరుడు లేదంటే వధువు కావాలని ఈ ఆలయంలో మొక్కుకుంటారట.
ఇక్కడ స్వామివారికి సమర్పించే నైవేద్యం, స్వీకరించే ప్రసాదం కూడా ఆసక్తికరమే. అదేంటంటే.. కలపను నైవేద్యంగా సమర్పించి, విభూతిని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇక ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే.. బ్రహ్మ శిల. దీని ప్రత్యేకతేంటంటే.. శివపార్వతుల కల్యాణానికి వేదికే ఈ బ్రహ్మ శిల అని చెబుతారు. దేశ విదేశాలకు చెందిన జంటలు ఈ ఆలయంలో వివాహం చేసుకునేందుకు వస్తుంటారు. లేదంటే ఈ ఆలయం గురించి తెలిసిన జంటలు తప్పక దీనిని దర్శించుకుని ఆది దంపతులైన శివపార్వతుల ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ ఆలయం కేదార్‌నాథ్‌కు సుమారు 25 కి.మీ.దూరంలోనూ.. రుద్రప్రయాగకు 70 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది.
