Site icon Bhakthi TV

సెప్టెంబర్ 6 నుంచి ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో ‘బాలాలయం’

ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో సెప్టెంబర్ 6 నుంచి బాలాలయం జరుగనుంది. ఈ నెల 8వ తేదీ వ‌ర‌కూ ఈ కార్యక్రమం జ‌రుగ‌నున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. ఇందుకోసం సెప్టెంబర్ 6న సాయంత్రం 5.30 గంట‌లకు అంకురార్పణ నిర్వహించనున్నారు. సాధారణంగా గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం ‘బాలాలయం’ కార్యక్రమాన్ని చేపడతారు. ఇందుకోసం ఆలయంలోని మండపంలో నమూనా ఆలయం ఏర్పాటు చేసి గర్భాలయంలోని మూలవర్ల చిత్రప‌టాల‌ను ఏర్పాటు చేస్తారు. తదుపరి మహా సంప్రోక్షణ జరుగు వరకూ స్వామి, అమ్మవార్లకు నిత్య కైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తారు.

ఆలయంలోని యాగశాలలో సెప్టెంబర్ 7, 8వ తేదీలలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు. సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 9.30 నుంచి 10. 30 గంటల మధ్య తులా లగ్నంలో బాలాలయ సంప్రోక్షణ నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్‌ఆర్ జిల్లాకు చెందిన ఒంటిమిట్టలోని ప్రాచీన హిందూ దేవాలయమే ఈ కోదండ రామాలయం. ఇక్కడి మూలమూర్తులు కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి ఉంటారు. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలలో వున్నందున ఈ క్షేత్రము ఏకశిలానగరంగా ప్రసిద్ధి చెందినది. నవ్యాంధ్ర ఏర్పడిన తరువాత ఈ ఆలయమున్న ఒంటిమిట్ట ఆంధ్రా భద్రాచలంగా పేరుగాంచింది.

Share this post with your friends
Exit mobile version