Site icon Bhakthi TV

అయోధ్యకాండ అఖండ పారాయ‌ణంతో పులకించిన స‌ప్తగిరులు

లోక‌క‌ల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై బుధవారం ఉదయం జరిగిన 12వ విడ‌త అయోధ్యకాండ అఖండ పారాయణం భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తింది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది. అయోధ్యకాండలోని 45 నుంచి 49వ‌ సర్గ వ‌ర‌కు మొత్తం ఐదు స‌ర్గల్లో 141 శ్లోకాలు, యోగ‌వాశిష్టం మ‌రియు ధ‌న్వంత‌రి మ‌హామంత్రంలోని 25 శ్లోకాలు క‌లిపి మొత్తం 166 శ్లోకాల‌ను పారాయణం చేశారు. ధర్మగిరి వేద పాఠశాల పండితులు డా. రామానుజాచార్యులు, శ్రీ అనంత గోపాలకృష్ణ, డా.మారుతి శ్లోక పారాయ‌ణం చేశారు.

అఖండ పారాయ‌ణంలో ధ‌ర్మగిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వవిద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్నత వేదాధ్యయ‌న సంస్థకు చెందిన వేదపారాయ‌ణదారులు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాల‌యానికి చెందిన శాస్త్ర పండితులు పాల్గొన్నా‌రు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి తేజోవతి బృందం “శరణు శరణు నీకు జగదేక వందిత కరుణతో మమ్ము నేలు కౌసల్య నందన..” అనే కీర్తనను కార్యక్రమ ప్రారంభంలో “ హరి హరి రామ నన్నరమర జూడకు నిరతము నీ నామస్మరణ మేమరను దశరధ నందన..” అనే సంకీర్తనను చివరిలో రసరమ్యంగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, పండితులు, విశేష సంఖ్యలో భ‌క్తులు పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version