Site icon Bhakthi TV

చితి పేర్చుకుని దూకబోయిన ఆంజనేయుడు.. అప్పుడేం జరిగిందంటే..

ఆంజనేయుడు ఓటమిని అంగీకరించి పందెం ప్రకారం చితి పేర్చాడు. చితిచుట్టూ ప్రదక్షిణలు చేసి.. “రామా!” అంటూ మంటల్లో దూకబోయాడు. అర్జునుడు దిగ్భ్రాంతి చెందాడు. తన కారణంగా ఆ మహాభక్తుడు ప్రాణాలు కోల్పోవడాన్ని భరించలేక, కృష్ణుడిని స్మరించాడు. అప్పుడే అక్కడికి ఒక పండు ముసలివాడు వచ్చాడు. చేతులు వణుకుతున్నాయి, కళ్ళు మసకబారాయి. అతను “ఏమయ్యా! ఏమి జరుగుతోంది ఇక్కడ? ఎందుకీయన ప్రాణత్యాగం చేయబోతున్నాడు?” అడిగాడు. ఇద్దరూ తమ కథ వివరించారు. వృద్ధుడు శాంతంగా విని “ఇదంతా జరిగినప్పుడు ఎవరైనా సాక్ష్యం ఉన్నారా?” అన్నాడు. ఎవరూ లేరని చెప్పడంతో, “అయితే ఈసారి నేనే చూస్తాను. మళ్లీ వంతెన నిర్మించు అర్జునా!” అని అన్నాడు.

అర్జునుడు ఈసారి వంతెన కట్టాడు. కానీ కృష్ణుడి స్మరణ చేయలేదు. ఆంజనేయుడు మాత్రం తన రాముణ్ణి తలచుకుని ఆ వంతెనపై అడుగుపెట్టగానే ఫట్ ఫట్ ఫట్! వంతెన కూలిపోయింది. అర్జునుడు తన ఓటమిని అంగీకరించి మంటల్లో దూకబోయాడు. అప్పుడే ఆ వృద్ధుడు చిరునవ్వు చిందించాడు. అర్జునుడికి ఆయన కృష్ణుడిలా కనిపించాడు, ఆంజనేయుడికి ఆయన రాముడిలా కనిపించాడు. ఇద్దరూ భక్తి పారవశ్యంతో “శ్రీరామా! శ్రీకృష్ణా!” అంటూ ఆ వృద్ధుడిని కౌగిలించుకున్నారు. కళ్లు తెరిచేసరికి.. ఆ వృద్ధుడు కనబడలేదు.

మిగిలింది ఒకరికొకరి కౌగిలే. అహంకారాన్ని విడిచి భక్తిని ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరూ గ్రహించారు.. దైవం ఒక్కటే. రూపాలు వేరు, మూలం ఒకటే. మనసు వినమ్రతతో దైవస్మరణ చేస్తే అదే విజయానికి మూలం.

Share this post with your friends
Exit mobile version