Site icon Bhakthi TV

మామలేశ్వర్ ఆలయం గురించి ఆసక్తికర కథేంటంటే..

పహల్గాంలోని మామలేశ్వర్ ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. ఇది కశ్మీర్‌లోని పురాతన ఆలయాల్లో ఒకటి. ఇది 12వ శతాబ్దంలో నిర్మించబడింది. రాజా జయసింహ అనే రాజు దీనిని నిర్మించారు. ఈ ఆలయానికి చారిత్రక, మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయంలోని శివలింగానికి మొక్కితే తప్పక కోరిన కోరికలు నెరవేరుతాయట. ఆలయానికి సంబంధించి కొన్ని పౌరాణిక కథలు ప్రచారంలో ఉన్నాయి. పార్వతి దేవి స్నానానికి వెళ్తూ పిండితో గణేశుడిని తయారు చేసి ప్రాణం పోసి ద్వారపాలకుడిగా నియమించిన విషయం తెలిసిందే.

ఎవ్వరినీ లోపలికి రానివ్వొద్దని పార్వతీ మాత చెప్పడంతో ఆ సమయంలో అక్కడికి వచ్చిన పరమేశ్వరుడిని సైతం వినాయకుడు అడ్డుకుంటాడు. శివుడు ఎంత చెప్పినా వినాయకుడు వినకపోవడంతో తలను ఖండిస్తాడు. పార్వతీ మాత విలపించడంతో ఏనుగు తలను తీసుకొచ్చి వినాయకుడికి అతికిస్తారు. ఈ కథంతా మనకు తెలిసిందే. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. గణేశుడికి ఏనుగు తలను అతికించిన ప్రదేశం ఇదేనని చెబుతారు. ఈ కారణంగానే ఈ ప్రదేశం శివ, గణపతుల భక్తులకు అత్యంత ముఖ్యమైన ప్రదేశంగా మారిపోయింది. ఈ ఆలయం సహజ సౌందర్యానికి కేరాఫ్‌లా అనిపిస్తుంది. ఇక్కడికి వెళ్లిన వారికి ఆధ్యాత్మిక అనుభవంతో పాటు ప్రశాంతత కూడా చేకూరుతుంది.

Share this post with your friends
Exit mobile version