
పరమేశ్వరుడి భక్తులు మహాశివరాత్రి అత్యంత ప్రాధాన్యమిస్తారు. భక్తులకు ఇది అతి పెద్ద పండుగ. మహాశివరాత్రికి దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల నుంచి భక్తులు శ్రీశైలానికి చేరుకుంటారు. జ్యోతిర్లింగాలలో దీనికి అత్యంత ప్రాధాన్యత ఉంది. దీనికోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏకంగా మంత్రుల బృందం శ్రీశైలానికి వచ్చి సమీక్ష నిర్వహించింది. భక్తులకు ఎలాంటి లోటూ రాకుండా చూడాలని ఆలయ అధికారులను ఆదేశించడమే కాకుండా భక్తులకు మంత్రుల బృందం శుభవార్త చెప్పింది. మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో నాలుగు రోజులపాటు ఉచిత లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు అందజేయనున్నారు.
ఈనెల 24 నుంచి శివరాత్రి ముగిసే వరకూ అంటే 27 వరకూ భక్తులకు ఉచితంగానే లడ్డూ ప్రసాదం అందించనున్నట్టు మంత్రుల బృందం వెల్లడించింది. అంతేకాకుండా శ్రీ మల్లికార్జున స్వామి, అమ్మవారి దర్శనార్థం పెద్ద ఎత్తున భక్తులు రానున్నారు. క్యూలైన్లలో ఉండే భక్తులకు 200 ఎం.ఎల్ మినరల్ వాటర్, పాలు, బిస్కెట్లు కూడా అందజేస్తారట. మరో సౌలభ్యాన్ని కూడా కల్పించారు. అలాగే మినీ వాహనాలను సైతం ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలోనే క్షేత్ర పరిధిలో పార్కింగ్ ప్రదేశాల నుంచి వసతి గృహాలకు, సత్రాలకు భక్తులను ఈ మినీ బస్సులు చేరవేయనుున్నాయి. అలానే మహాశివరాత్రి రోజు అంటే 25, 26 తేదీలలో దేవస్థానం టోల్ గేట్ వద్ద ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా వాహనాలను అనుమతిస్తున్నట్లు మంత్రుల బృందం ప్రకటించింది.
