
బోనాల పండుగ సమయంలో పోతురాజు, ఘటం, రంగం కీలక పాత్ర పోషిస్తాయి. దేవీ అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ. పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి స్ఫురద్రూపిగా బలశాలిగా ఉంటాడు. ఒంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాలికి గజ్జెలు కలిగి, చిన్న ఎర్రని ధోతీని ధరించి డప్పువాయిద్యానికి అనుగుణంగా ఆడతాడు. అతను భక్త సమూహము ముందు ఫలహారం బండి వద్ద నర్తిస్తాడు. అతను పుజాకార్యక్రమాల ఆరంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడాతాడు. కొరడాతో బాదుకొంటూ, వేపాకులను నడుముకు చుట్టుకుని, అమ్మవారి పూనకములో ఉన్న భక్తురాండ్రను ఆలయములోని అమ్మవారి సమక్షానికి తీసుకెళతాడు.
బోనాల పండుగ దేవికి నైవేద్యము సమర్పించు పండుగ కావడం చేత, ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతో పాటు స్వీకరిస్తారు. నివేదనానంతరం మాంసాహార విందు భోజనం మొదలౌతుంది. పండుగ జరిగే ప్రాంతాలలో వేపాకులతో అలంకరించబడిన వీధులు దర్శనమిస్తాయి. జానపద శైలిలో ఉండే అమ్మవారి కీర్తనలతో నిండిన మైకుసెట్ల హోరులో పండుగ వాతావణం విస్పష్టంగా ప్రస్ఫుటమౌతుంది.
రంగం
రంగం, లేక జాతకం చెప్పడం పండుగ రెండవ రోజు ఉదయం జరుగుతుంది. భక్తుల అభ్యర్తన మేరకు పూనకంలో ఉన్నటువంటి యుక్తవయసు కన్నెపిల్లలు వచ్చే సంవత్సరం గురించి జాతకం చెబుతారు. ఈ కార్యక్రమం జాతర ఊరేగింపుకు ముందు జరుగుతుంది.
ఘటం
అమ్మవారి ఆకారములో అలంకరింపబడిన రాగి కలశాన్ని ఘటం అని సంబోధిస్తారు. సాంప్రదాయక వస్త్రధారణ, ఒంటి పై పసుపు కలిగిన పూజారి ఈ ఘటాన్ని మోస్తాడు. పండుగ మొదటి రోజు నుండి, చివరి రోజు నిమజ్జనం దాకా ఈ ఘటాన్ని డప్పుల మేళవాద్యాల నడుమ ఊరేగిస్తారు. ఘటం ఉత్సవం రంగం తర్వాత జరుగుతుంది. హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయము వారి ఘటముతో ఏనుగు అంబారీపై, అశ్వాల మధ్య, అక్కన్న, మాదన్నల బొమ్మల నడుమ ఊరేగింపు మొదలయ్యి సాయంత్రానికి కన్నుల పండుగగా నయాపుల్ వద్ద ఘటముల నిమజ్జనతో ముగుస్తుంది.
లాల్‌దర్వాజా నుంచి నయాపుల్ వరకు వీధుల వెంబడి వేలాదిమంది ప్రజలు నిలుచుని రంగ రంగ వైభవంగా అలంకరించబడిన ఘటాలను చూస్తారు. పోతురాజుతో పాటు, వివిధ పౌరాణిక వేషధారణలలో ఉన్న కుర్రవాళ్ళు తమదైన రీతిలో జానపదగీతాలు, వాయిద్యాల మధ్య నృత్యం చేస్తారు.
