Site icon Bhakthi TV

కుంకుమను ఎందుకు ధరించాలి?

స్త్రీ పురుషులు ఇద్దరు, కుంకుమ పెట్టుకోవటం హిందూ సంప్రదాయము. అన్ని కులాల హిందువులు, శైవ వైష్ణవ మతస్థులు, అందరూ నొసటన, కుంకుమ ధరించడం, గొప్పదనంగా భావిస్తారు. కుంకుమ ఆస్తికతకు చిహ్నము. 5, 6, వందల సంవత్సరాల క్రితం వరకు, హిందూ మతస్తులందరూ తప్పనిసరిగా కుంకుమను నొసట దిద్దుకునే ఆచారం బలీయంగా ఉండేది. ఆచారంగా మాత్రమే కాకుండా, అలంకారంగా కూడా ఉండేది. హరిచంద్నాన్ని, మంచి గంధాన్ని, విభూతిని గూడా నొసట ధరించడం, హిందూ సంప్రదాయంగా పాటిస్తూ వచ్చారు, పూర్వీకులు. రెండు కనుబొమ్మలకు మధ్యభాగంలో, నుదుటి వద్ద “ఇడ” “పింగళ” అనునాడులు కలిసి “సుషుమ్న” నాడిగా పరివర్తన చెందే స్థలం వద్ద కుంకుమను దిద్దుకుంటాము.

ఈ కుంకుమ వల్ల, మనిషికి దృష్టి దోషం తగలకుండా ఉంటుందని కూడా ఒక నమ్మకం ఉంది. మరొకటి ఏమిటంటే కుంకుమ ధరించే వ్యక్తికి ఎదుటివారు, మానసికంగా లొంగిపోతారన్న వాదన కూడా ఉంది. ఎర్రని ఎరుపు రంగు మనిషికి, మనోశక్తిని, త్యాగతత్వాన్ని, నిర్భయత్వాన్ని, పరోపకార గుణాన్ని కలిగిస్తాయన్న సిద్ధాంతం, కూడా ఉంది. కుంకుమ ధరించడం పవిత్రతకు, ఆస్థికత్వానికి, ధార్మికత్వానికి, పురుషులకు సంకేతమైతే, స్త్రీలకు ఐదవతనానికి, సౌభాగ్యానికి, స్థిరబుద్ధికి సంకేతంగా చెప్పవచ్చు. మానవుడు నాగరికత నేర్పిన దగ్గర నుండి కుంకుమను ముఖ్య అలంకారంగా కూడా భావించినట్లు కొన్ని గ్రంథాలలో ఉంది. భర్తను కోల్పోయిన స్త్రీలు, పరులెవ్వరికి అందంగా తాము కనిపించకూడదు, అన్న ఉద్దేశంతోనే కుంకుమ ధారణను త్యజిస్తారు. కుంకుమ భారతీయతకు, చెరుగని ముద్ర. పాఖ్యాత్య నాగరికత, మన మీదకు దాడిచేసిన తర్వాత, పురుషులందరూ కుంకుమ ధారణ మరచి పోయారు. ఇంకొంత కాలానికి స్త్రీలు కూడా మరిచిపోవచ్చు నేమో. దేవుళ్లు మాత్రమే మిగుల్చుకుంటారేమో.

Share this post with your friends
Exit mobile version