
వాల్మీకి మహర్షి పేరు తెలియనిదెవరికి? రామాయణం ప్రపంచానికి తెలియజేసిన మహానుభావుడు. రత్నాకరుడు కాస్త వాల్మీకిగా మారి రామాయణ ఖండ కావ్యాన్ని రచించారు. ఇది ఆదికావ్యంగానూ.. వాల్మీకి మహర్షి ఆది కవిగానూ కీర్తించబడుతున్నారు. అయితే వాల్మీకి మహర్షి రెండో జన్మ కూడా తీసుకున్నారా? తీసుకుంటే మరు జన్మలో ఆయన ఎవరు? మరో జన్మలో ఆయన ఏం చేశారనే విషయాలను తెలుసుకుందాం. వాల్మీకి మహర్షియే మరు జన్మలో తులసీదాస్‌గా జన్మించారని చెబుతారు. వాల్మీకిగా రామాయణాన్ని రచిస్తే.. తులసీదాస్‌గా రామాయణాన్ని ప్రపంచానికి పరిచయం చేసే బాధ్యతను స్వీకరించారట.
అందుకే తులసీదాస్ తన చిన్న వయసు నుంచే రాముడి సేవలో తరించారని చెబుతారు. ఆయన నుంచి హనుమాన్ చాలీసా, హనుమాన్ బాహుక్, సంకటహర మోచన హనుమాన్ స్త్రోత్రం వంటి ఎన్నో అద్భుతమైన శ్లోకాలు, మంత్రాలు వెలువడ్డాయి. ఆయన రచనల్లో రామ చరిత మానస్ ఒక అద్భుతమైన కావ్యం. దీనిని తులసీదాస్ సరిగ్గా శ్రీరామ నవమి రోజున మొదలుపెట్టారట. కేవలం రెండు సంవత్సరాల సమయం తీసుకుని పది వేల దోహాలతో రామచరిత మానస్‌ను రచించారని చెబుతారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. తులసీదాస్ రామచరిత మానస్ సంకీర్తనలను వినేందుకు హనుమంతుడు వచ్చేవాడని చెబుతారు.
