ఒక రోజులో అసుర సంధ్య వేళ కేవలం శివ పూజకు ఎంత విశిష్టమో అలా ఒక నెలలో మాస శివరాత్రి అటువంటిది. ఈరోజు కూడా మహాశివరాత్రి లాగానే శివారాధనలూ, శివాభిషేకాలు, బిల్వ పత్రి పూజలూ, శివాలయ సందర్శనలూ, భజనలూ, ఉపవాసాలు, జాగరణలూ చేయడం పరిపాటి. ఆరాధనలో ఎటువంటి తేడా లేదు. అయితే రోజూ చేసే ఉపాసన కన్నా ఈ రోజు చేసే ఉపాసన కొంత అధికం. అలాగే మాఘమాసంలో వచ్చే కృష్ణ పక్ష చతుర్దశిని మహా శివరాత్రి అని నిర్ధారించారు. ఆరోజే రాత్రే శివలింగము ఆవిర్భవించిందని శాస్త్ర వాక్కు.
మాస శివరాత్రిని శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలంటే అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు సశాస్త్రీయంగా ఉపవాసము ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానాధికాలు ముగించుకుని దగ్గరలోని శివాలయ దర్శనం చేయాలి. అవకాశం ఉన్న వారు వారి శక్తి మేర 3, 5, 11, 18, 21, 54, 108 ఇలా ప్రదక్షిణలు చేయవచ్చు. అలాగే ఈ రోజు శివాలయములో పూజలో పెట్టిన చెరకు రసమును భక్తులకు పంచినచో వృత్తి సంబంధిత పనుల్లో ఇబ్బందులను ఎదుర్కొనేవారికి ఆటంకాల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు.
