ముఖ్యంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని వైశాఖ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి రోజుల్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే చాలా మంచిదట. ఇతర మాసాల్లో పౌర్ణమి రోజుల్లో చేసిన దానికన్నా కోటిరెట్ల అధిక ఫలం లభిస్తుందట. సత్యాన్ని ఆశ్రయించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయనే సందేశాన్ని సత్యనారాయణ స్వామి వ్రతం అందిస్తుంది.
ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శ్రేయస్సు పొందాలంటే.. ప్రతి పౌర్ణమికి ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకోవాలని చెబుతారు. ఈ వ్రతాన్ని ఒక ఏడాది పాటు ఆచరిస్తే.. జీవితంలోని అడ్డంకులు, కష్టాలన్నీ తొలగిపోతాయట.
సత్యనారాయణ స్వామి వ్రతంలో కథా శ్రవణం అనేది అత్యంత ముఖ్యమైన అంశంగా పేర్కొంటారు. ఈ వ్రతంలో మొత్తంగా 5 కథలు ఉంటాయి. ఈ కథలన్నీ సత్యాన్ని పాటించడం వల్ల ఏం జరుగుతుందనేది వివరిస్తూ ఉంటాయి. అలాగే సత్యనారాయణ స్వామి వ్రత మహత్స్యాన్ని సైతం వివరిస్తాయి. భగవంతునికైనా సరే ఇచ్చిన మాట తప్పకూడదన్న సత్యాన్ని చెబుతూ, మాట తప్పితే ఎలాంటి పరిణామాలు ఉంటాయనే విషయాన్ని వ్రత మహత్యం తెలుపుతుంది. వ్రతంలో భాగంగా భక్తిశ్రద్ధలతో ఈ 5 కథలు వింటేనే వ్రతం పూర్తవుతుంది. సంకల్పం నెరవేరుతుంది. సత్యం, రుజువర్తనం ద్వారా సకల శుభాలు, ఐశ్వర్యాలు ఎలా పొందవచ్చో ఈ కథలు మనకు తెలుపుతాయి.
