Site icon Bhakthi TV

నారాయణ నామ స్మరణ మహత్స్యం గురించి వశిష్టుడు చెప్పిన కథేంటంటే..

వశిష్టుల వారిని జనక మహారాజు అడిగిన సందేహం గురించి మనం ఇప్పటికే తెలుసుకున్నాం కదా.. నదీస్నానం, దీపారాధన, దీపదానం, ఉపవాసం, పురాణ శ్రవణం, వనభోజనం వంటి స్వల్ప ధర్మముల వలన ఎలా పాపములు నశించి మోక్షం కలుగుతుందన్న ప్రశ్నకు వశిష్టుల వారు అజమిళోపాఖ్యానం అనే కథను వివరించారు. పూర్వం కన్యాకుబ్జమను నగరమున నాలుగు వేదాలు చదివిన సత్యవ్రతుడను ఒక విప్రుడున్నాడు. అతనికి హేమవతి అనే సకల సద్గుణ సంపన్నురాలైన భార్య ఉంది. వారికి చాలా కాలానికి ఓ కుమారుడు పుట్టాడు. అతనికి అజామిళుడు అని పేరు పెట్టారు. లేకలేక కలిగిన సంతానం కావడంతో గారాబముగా పెంచేవారు. దీంతో అతను దుష్ట సహవాసముల మరిగి, విద్యాభ్యాసం చేయక, బ్రాహ్మణ ధర్మములు పాటించక భ్రష్టుడయ్యాడు.

అజామిళుడు యవ్వనవంతుడైన తరువాత కామాంధుడై మంచి చెడ్డలు మరిచాడు. మద్యం సేవిస్తూ ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతో కామక్రీడల్లో మునిగిపోయాడు. ఇల్లు, తల్లిదండ్రులు అందరినీ మరిచాడు. ఎరుకలతో స్త్రీతో కలిసి వేటాడుతూ ఉండేవాడు. ఒకరోజు ఎరుకల స్త్రీ వేటకు వెళ్లి చెట్టు కొమ్మపై నుంచి కిందపడి మరణించింది. ఆమె కోసం అజామిళుడు బాగా దు:ఖించాడు. అయితే ఆమె మరణించే నాటికే అజామిళుడితో ఒక కుమార్తెను పొందింది. బాలికకు యుక్త వయసు రాగానే అజామిళుడు కన్న కుమార్తె అని కూడా చూడకుండా ఆమెను చెరబట్టాడు. కూతురితో కూడా ఇద్దరు కుమారులను కన్నాడు కానీ పురిటిలోనే చనిపోయాడు. మూడోసారి పుట్టిన వాడికి నారాయణుడని నామకరణం చేసి ప్రేమగా పెంచుకునేవాడు. కొంతకాలానికి అజామిళుడు వయసు రీత్యా రోగగ్రస్తుడై మరణించాడు. యమభటులు అతడిని యమలోకానికి తీసుకెళ్లాడు. అజామిళుడు నారాయణ నామ స్మరణ చేయడంతో యమ భటులు వణికిపోయారు. దీంతో శంఖ చక్ర గదాధారులైన శ్రీమన్నారాయణుని దూతలు వచ్చి “వీడు నారాయణ నామం పలకడం వల్ల ఇతని సర్వ పాపములు పటాపంచలైనాయి” అని చెప్పి అతనిని వైకుంఠమును తీసుకొనివెళ్ళారు. నారాయణ నామ స్మరణకు అంతటి మహత్యముందని జనక మహారాజుకు వశిష్టుల వారు వివరించారు.

Share this post with your friends
Exit mobile version