విజయవాడలోని యనమలకుదురు కొండపై వెలిసిన పార్వతి రామలింగేశ్వర ఆలయాన్ని తపోభూమిగా పేర్కొంటారు. గతంలో ఈ ప్రాంతంలో వేయి మంది మునులు తపస్సు చేశారట. కాబట్టి అప్పట్లో దీనిని ‘వేయి మునుల కుదురు’గా పిలిచేవారు. కాలక్రమంలో ఇది యనమలకుదురుగా మారింది. అయితే ఇప్పటికీ అక్కడి గాలిలో ఓంకారం వినిపిస్తూ ఉంటుందని చెబుతారు. ఆలయ స్థల పురాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ మహా విష్ణువు లోకకల్యాణార్థం దశావతారాలు దాల్చాడని చెబుతారు. అలా శ్రీమహావిష్ణువు ఆరవ అవతారమే పరశురామావతారంగా చెబుతారు.
పరశురాముడు మరెవరో కాదు.. జమదగ్ని మహర్షి, రేణుక దంపతుల వరపుత్రుడు. ఇక్కడ పార్వతి రామలింగేశ్వరుడి గర్భాలయంలో పార్వతి సమేత రామలింగేశ్వరుని పరశురాముడే ప్రతిష్టించి పూజలు నిర్వహించాడని చెబుతారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలు సైతం ఉన్నాయి. వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, దాసాంజనేయస్వామిని కూడా భక్తులు దర్శించుకోవచ్చు. ఈ ఆలయం శివకేశవ క్షేత్రంగా ప్రఖ్యాతిగాంచింది. దీనికి కారణం ఏంటంటే.. విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడు పూజించిన లింగం కాబట్టి ఈ క్షేత్రం శివకేశవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. సీతారాములు సైతం తమ వనవాస సమయంలో పార్వతి రామలింగేశ్వరుని పూజించారని చెబుతారు.
