తన ఇంటికి శివపార్వతులను కుబేరుడు విందుకు ఆహ్వానించగా.. అతని మనసులో మాటను పసిగట్టిన పార్వతీపరమేశ్వరులు తమ కుమారుడైన గణపతిని భోజనానికి తీసుకెళ్లమన్నారు. ఈ ఏనుగు ముఖమున్న పసిపిల్లవాడా, తన ఇంటికి విందుకోచ్చేదనుకున్నాడు కుబేరుడు. ఎంత తింటాడులే అనుకుంటూ గణపతిని తీసుకుని అలకాపురిలో ఉన్న తన భవనంలోకి తీసుకెళ్ళి, తన భవనంలో ఉన్న సౌకర్యాలను, ఇతర సంపదలను చూపిచసాగాడు. ఇవన్నీ వ్యర్ధం, త్వరగా ఆహారం పెట్టండి అని గణపతి అనగా, కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారికి ఆజ్ఞ చేశాడు. వెంటనే బంగారు కంచం పెట్టి, రకరకాల తీపి పదార్ధలు, పానీయాలు, కూరలు, పండ్లు గణపతికి వడ్డించారు. కుబేరుడు చూస్తుండగానే ఒక్కపెట్టున గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని, అక్కడ పాత్రల్లో పెట్టిన ఆహారాన్ని తినేసి, ఇంకా తీసుకురండి అంటూ ఆజ్ఞ చేశాడు.
సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకువచ్చి గణపతికి వడ్డించారు. అయినా వినాయకుడు ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు, కడుపు నిండలేదు. ఇంకా కావాలి అంటూ గణపతి అడిగాడు. వంటవారికి ఆహారం వండడం గణపతికి వడ్డించడమే పనైపోయింది. కాసేపటికి కుబేరుడి వంటశాల మొత్తం ఖాళీ అయిపోయింది. విషయం కుబేరుడికి తెలిసింది. తన సంపద మొత్తం తరిగిపోతోంది కానీ, గణపతి కడుపు నిండడం లేదు, ఏమి చేయాలో అర్ధంకాలేదు. ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుని పిలిచి, నీ ఇంటికి విందుకు రమ్మని, నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావ్ అంటూ పలికాడు. కుబేరుడికి విషయం అర్ధమైంది. తనకున్న సంపద ఆ పరమాత్ముడిని ఏ మాత్రం సంతృప్తి పరచలేదని, అన్ని ఇచ్చిన భగవంతుడి దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని, తన అహంకారం అణచడానికే దైవం ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగుపరుగున కైలాసానికి వెళ్ళాడు.
శివా! శంకరా! నేవే దిక్కు. ధనానికి నన్ను నీవే అధిపతిని చేశావని మరిచి అహకారంతో ప్రవర్తించాను. అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్నీ ఖాళీ చేసి, అన్ని ఇచ్చిన భగవంతుడే, అహంకరించినవారి సర్వసంపదలు తీసివేస్తాడని నిరూపించాడు. మీ బిడ్డడైన గణపతి ఆకాలి తీర్చలేకపోతున్నాను. ఏదైనా మార్గం చూపించండి అన్నాడు. అప్పుడు శివుడు “కుబేరా! నేవు ఇంతసేపు అహకారంతో గణపతికి భోజనం పెట్టావు. అందుకే గణపతి సంతృప్తి చెందలేదు. గణపతికి కావల్సినది భక్తి మాత్రమే. నీకు ఎంత ఉందన్నది అతనికి అనవసరం, నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మత్రామే గణపతి చూస్తాడు. ఇదిగో ఈ గుప్పేడు బియ్యం తీసుకుని, అహకారం విడిచి, చేసిన తప్పని ఒప్పుకుని పరమభక్తితో గణపతికి సమర్పించు” అన్నాడు. కుబేరుడు ఆ గుప్పెడు బియ్యాన్ని ఉడికించి, గణపతికి భక్తితో సమర్పించాడు. ఆ గుప్పేడు అన్నం తినగానే గణపతికి కడుపు నిండి, త్రేనుపులు వచ్చాయి. గణపతి సంతృప్తి చెందాడు.
