ఈశ్వరానుగ్రహంతో ఐశ్వరం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడిననే అహకారం కలిగింది. అందువల్ల దేవతలందరికి మంచి విందు భోజం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని తలచాడు కుబేరుడు. దేవతలందరిని ఆహ్వానించి, శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్ళాడు. ‘శివుడు కొండల్లో ఉంటాడు, ఒక ఇల్లు కూడా ఉండదు. నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు. ఎంత బాగుందో అంటూ పొగుడుతాడు, అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుంది’ అనే ఆలోచనలతో కైలాసం చేరుకున్నాడు.
శివుడు సర్వాంతర్యామి, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమంకుంటున్నారో అన్ని తెలుసుకోగలడు. కుబేరుడు అహాన్ని పసిగట్టాడు. పార్వతీదేవి కూడా కుబేరుడి పథకాన్ని అర్దం చేసుకుంది. కుబేరుడు వచ్చేసరికి శివపార్వతులు మాట్లాడుకుంటున్నట్టు నటించారు. కుబేరుడు వచ్చి, మహాదేవా! మీరు, పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అన్నాడు. శివుడు తనకు కుదరదన్నాడు, భర్త రాకుండా తానుకూడా రానన్నది పార్వతీ దేవి. ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు. వస్తూనే ‘అమ్మా! ఆకాలేస్తోంది, ఏదైనా ఉంటే పెట్టు’ అన్నాడు గణపతి. పార్వతీదేవి గణపతి వైపు కనుసైగ చేసి ‘కుబేరా! మా గణపతి మీ ఇంటికి విందుకు వస్తాడు’ అనగా, శివుడు ‘ఔనౌను, గణపతికి విందు భోజనం అంటే మహాఇష్టం. మా బదులుగా గణపతిని తీసుకెళ్ళూ’ అన్నాడు పరమశివుడు. సరేనని తన ఇంటికి పసిపిల్లవాడైన గణపతిని కుబేరుడు తీసుకెళ్లాడు. ఆ తరువాత ఏం జరిగిందో మరో కథనంలో తెలుసుకుందాం.
