గురువాయూర్ ఆలయం దాదాపు 5000 సంవత్సరాల క్రితం నాటిదని చెబుతారు. ఈ ప్రాచీన ఆలయంలోని గర్భాలయంలో వెలసిన శ్రీకృష్ణుడికి మరో పేరు కూడా ఉంది. ఇక్కడి కన్నయ్యను భక్తులు ‘ఉన్నికృష్ణన్’ అని పిలుస్తారు. నాలుగు చేతులతో శ్రీకృష్ణుడు భక్తులకు దర్శనమిస్తాడు. ఒక చేతిలో పాంచజన్యం, మరో చేతిలో సుదర్శన చక్రం, ఇంకో చేతిలో హస్తాల్లో కౌముది, మరో చేతిలోతామర పుష్పంతో భక్తులను కరుణిస్తూ ఉంటాడు. గురువాయూర్‌లో ఆలయ ప్రధాన పూజారి తెల్లవారుజామున 3 గంటలకు క్షేత్రానికి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా వచ్చి నాదస్వరంతో చిన్నికృష్ణుడిని నిద్ర లేపడం ఆనవాయితీ.
ఈ దర్శనాన్ని ‘నిర్మల దర్శనం’ అని పిలుస్తారు. నిత్యం స్వామివారి విగ్రహాన్ని పాలు, గులాబీ అత్తరు, కొబ్బరినీళ్లు, గంధాలతో అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో అలంకరిస్తారు. ఇక్కడ స్వామివారికి సమర్పించే నైవేద్యాలు కూడా విభిన్నంగా ఉంటాయి. బియ్యం పిండి, బెల్లం, నెయ్యితో చేసిన తీపి రొట్టెలు, కొబ్బరి ఉండలు, కొబ్బరి పాలు, బెల్లం, బియ్యంతో చేసిన పాయసం, పాలలో ఉడికించిన పిండిరొట్టెల్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం స్వామివారి పుత్తడి ఉత్సవ విగ్రహాన్ని అంబారీ ఎక్కించి మేళతాళాలతో ప్రహరీ లోపల ఆలయం చుట్టూ మూడు సార్లు తిప్పుతారు. 108 శ్రీవైష్ణవ దివ్యదేశాల్లో ఈ క్షేత్రమైతే లేదు కానీ వైష్ణవులకు మాత్రం ఇదో పవిత్ర ప్రదేశం.
