
పుష్పదంతుడు గాంధర్వ రాజు, శివ భక్తుడు. సంగీత ప్రవీణుడు. కామ రూపంలో ఎవరికీ కన పడకుండా ఆకాశమార్గంలో సంచరించ గలవాడు. ఇతని సంగీత వైదుష్యాన్ని మెచ్చి ఇంద్రుడు తనకొలువు అయిన దేవేంద్ర సభలో సంగీత విధ్వాంసునిగా నియమిస్తాడు . ఒకసారి పుష్పదంతుడు ఆకాశమార్గంలో అదృశ్యంగా సంచరిస్తూ చిత్ర రధుడు అనే రాజు పాలిస్తున్న నగరాన్ని సందర్శిస్తాడు. చిత్ర రధుడు గొప్ప శివ భక్తుడే. పరమేశ్వర పూజ కోసం ఒక గొప్ప పూల తోటను పెంచుతాడు .అది వివిధ పుష్పాలతో ఎప్పుడూ శోభాయమానంగా ఉంటుంది. పుష్పదంతుడు ఈ ఉద్యానవనాన్ని చూసి పరవశించి పోతాడు. అందులో ప్రవేశించి పూలు కోస్తాడు.
అదృశ్య రూపంలో ఉండటం వలన ఆతనిని రక్షక భటులు చూడలేక పోతారు. రెండు మూడు రోజులు ఇలాగే గడిచాక చిత్ర రధ రాజు పరమేశ్వర పూజకు తన తోటలో పూలు లేక పోవటం గమనిస్తాడు. భటులను ప్రశ్నిస్తే వాళ్ళు రాత్రీ పగలు తాము కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని కాపలా కాస్తున్నామని పూలు ఎవరు కోసి మాయం చేస్తున్నారో అర్ధం కావటం లేదని రాజుకు విన్నవించారు. వారు అత్యంత విశ్వాస పాత్రులు కనుక వారి మాట నమ్మి రాజు పూల దొంగను ఎలా పట్టుకోవాలనే విషయమై చాలా మధన పడ్డాడు. మర్నాడు రక్షక భటులను పిలిపించి రాజు అన్ని పూల చెట్ల కిందా మారేడు దళాలను వెదజల్లమని ఆజ్ఞాపిస్తాడు భటులు అలాగే చేశారు. ఆ తరువాత ఏం జరిగిందో మరో కథనంలో తెలుసుకుందాం.
