
దుర్వాస మహర్షి ఇంద్రుణ్ని శపించినప్పుడు, ఇంద్ర సంపద స్వరూపిణి అయిన లక్ష్మి సముద్రంలో పడిందన్న మరో కథనమూ కొన్ని పురాణాల్లో కనిపిస్తుంది. క్షీరసాగర మథనంలో ఆవిర్భవించిన లక్ష్మిని శ్రీ మహావిష్ణువు మళ్ళీ చేపట్టాడు. సర్వ జగతికీ మూలస్వరూపం కనుకనే ఆమెను ప్రకృతి అన్నారు. లక్ష్మీదేవి అష్టోత్తర శతనామాల్లో మొట్టమొదటి పదం ‘ప్రకృతి.’ ప్రకృతి రూపంలో సర్వత్రా గోచరమవుతున్న లక్ష్మికి చేసే స్తోత్రమది..! ఇంద్రాదులచే పూజలు అందుకుంటున్న ఆ జగజ్జనని నారాయణుడి హృదయంలో కొలువు తీరింది.
ఫలితంగా దేవతలకు కష్టాలు తొలగిపోయి అమృతం లభించిందని పురాణాలు చెబుతున్నాయి. ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, విజయలక్ష్మి, సంతాన లక్ష్మి… ఇలా ఎనిమిది రూపాల్లో అష్ట లక్ష్మీదేవిగా లక్ష్మి అర్చనలు అందుకుంటోంది. ధనం, ధాన్యం, పాడి, పంట, విద్య, విజ్ఞానం, సద్బుద్ధి, చల్లని సంసారం, అన్యోన్య దాంపత్యం, సత్సంతానం, కడుపు నిండా తిన్నదాన్ని జీర్ణం చేసుకోగలగడం – ఇవన్నీ లక్ష్మీదేవి కటాక్షాలే..! వీటన్నింటినీ మించిన లక్ష్మి – అంటే – ‘నాకు అన్నీ ఉన్నాయి’ అనుకునే ఆత్మతృప్తి..! ఈ ఆత్మతృప్తి కనిపించిన.. చోటును లక్ష్మీ దేవి వదిలిపోదు..!
