
ఈ భాద్రపద మాసం పూర్ణిమ కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున విష్ణువు రూపమైన సత్యనారాయణ స్వామికి పూజలు చేస్తారు. అదే రోజు, ఉమా-మహేశ్వర ఉపవాసం కూడా చేస్తారు. ఈ రోజు కూడా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఎందుకంటే అదే రోజు పితృపక్షం వస్తోంది. ఈ రోజున పితృదేవతలకు అర్ఘ్యమివ్వడం.. గోమాతకు అవిసె ఆకులు ఇవ్వడం శుభ ఫలితాలను ఇస్తాయి. భాద్రపద పూర్ణిమ నాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. ఉదయం నిద్రలేచి శుచిగా స్నానమాచరించాలి. తీర్థాలు, కొలను, చెరువుల్లో అయితే మంచిది. సత్యనారాయణ వ్రతం ఆచరించడం.. పూజకు పువ్వులు, ప్రసాదం సమర్పించడం చేయాలి.
సత్యనారాయణ కథకు విన్న తర్వాత ప్రసాదాన్ని తీసుకోవడం మరవకూడదు. ఆపై పేద బ్రాహ్మణులకు వస్త్రదానం చేయాలి.
ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమి ప్రత్యేకతను కలిగి ఉంటుంది. పౌర్ణమి రోజున చేసే పూజాభిషేకాలు వలన లభించే ఫలితం కూడా అధికంగా ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలాంటి పౌర్ణమిలలో భాద్రపద పౌర్ణమి మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. ఈ రోజున శివపార్వతులను సేవించడం వలన , విశేషమైన ఫలితాలు లభిస్తాయని స్పష్టం చేయబడుతోంది.అందువల్లనే ఈ రోజు ‘ఉమామహేశ్వర వ్రతం’ ఆచరించాలని చెప్పబడుతోంది. ఉమా మహేశ్వరులను లోకానికి తల్లిదండ్రులుగా భావించి పూజించడం జరుగుతుంటుంది. పాపాలను నశింప జేసి .. పుణ్యలోకాలను ప్రసాదించేవాడు శివుడైతే , సంతాన సౌభాగ్యాలను అనుగ్రహించే అమ్మగా పార్వతీదేవి కనిపిస్తుంది. అలాంటి ఆది దంపతులను ఏ రోజున పూజించినా .. స్మరించినా ఆశించిన ఫలితాలు అందుతాయి.
