Site icon Bhakthi TV

అమ్మవారికి పసుపు కొమ్ముల మాల వేయడంలో అంతరార్థం ఏమిటంటే..

దుర్గమ్మకు సౌభాగ్య సిద్ధి కోసం, దృష్టి దోష నివారణ కోసం పసుపు కొమ్ముల మాలను వేస్తారు. దీని అంతరార్థం ఏమిటో తెలుసుకుందాం. పసుపు కొమ్మును తిరిగి భూమిలో పాతిపెడితే మొలకెత్తుతుంది. అయితే ఒకసారి దానిని ఉడికించి ఎండబెట్టిన తర్వాత భూమిలో పాతిపెడితే మాత్రం మొలకెత్తదు. అలాగే మనలోని అరిషడ్వర్గాలను, కోరికలు దహించి వేసి, పునర్జన్మ లేకుండా తనలో ఐక్యం చేసుకోమని వేడుకోవడమే ఈ పసుపు కొమ్ముల మాలను దుర్గమ్మకు వేయడంలో అంతరార్థంగా చెబుతారు. పసుపు ఒక అద్భుతమైన యాంటీబయాటిక్‌ అన్న విషయం తెలిసిందే.

అలాగే అమ్మవారికి పసుపు మాల వేయడం వల్ల మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అమ్మవారికి వేసే మాలలో కొమ్ముల సంఖ్య అనేది మన సంకల్పాన్ని బట్టి ఉంటుంది. సాధారణంగా అయితే 108 కొమ్ములతో మాలను తయారు చేస్తారు. అష్టోత్తర శత నామావళికి ప్రతీకగా దీనిని వేస్తారు. అయితే 108 కొమ్ములతో మాలను వేయడమనేది వీలు పడకుంటే వాటిలో సగమైనా అంటే 54 కొమ్ములతో కూడా మాల తయారు చేసి సమర్పిస్తారు. ఇది కూడా వీలు కాదంటే కనీసం 21 కానీ 11 కొమ్ములతో కానీ మాలను తయారు చేసి వేస్తారు. ఇక ఆ మాలను పసుపు దారంతోనే కట్టాలి.

Share this post with your friends
Exit mobile version