శుభకార్యాల్లో కొబ్బరికాయను కొట్టడం వెనుక ఉన్న అసలు భావం మన అహంకారాన్ని దైవానికి సమర్పించడం. సనాతన ధర్మంలో ఈ ఆచారం యాదృచ్ఛికం కాదు, గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని కలిగిఉంది. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి భూమిపై అవతరించినప్పుడు లక్ష్మీదేవితో పాటు కొబ్బరి చెట్టును తీసుకువచ్చాడని చెబుతారు. అందుకే కొబ్బరికాయను “శ్రీఫలం”గా గౌరవిస్తారు. పూజలో కలశంపై ఉంచే ఈ ఫలం, శుభం సంపదకు సూచిక. కొబ్బరికాయపై ఉన్న మూడు కన్నులు శివుడు త్రినేత్రాలను సూచిస్తాయని పెద్దలు చెబుతారు. కొబ్బరికాయను కొట్టినపుడు రెండుగా పగిలిపోతుంది. ఇది మనలోని అహంకారం, స్వార్థం తొలగిపోవడాన్ని సూచిస్తుంది. లోపల ఉన్న స్వచ్ఛమైన నీరు మన హృదయ పవిత్రతకు ప్రతీక. పూర్వకాలంలో జంతుబలికి బదులుగా కొబ్బరికాయను సమర్పించడం ప్రారంభమైందనే నమ్మకం ఉంది. ఇది హింసకు బదులుగా భక్తిని ప్రతిబింబిస్తుంది. అందుకే ప్రతి శుభారంభంలో ముందుగా కొబ్బరికాయ కొడతారు. ఇది చిన్న ఆచారం కాదు…. మనసును శుద్ధి చేసి, దైవానికి సంపూర్ణంగా మనల్ని అర్పించుకునే పవిత్రమైన సంకేతం.
2. ఢిల్లీ అక్షర్‌ధామ్ నీలకంఠవర్ణి విగ్రహం ప్రత్యేకతలు ఇవే
