గుజరాత్‌లోని సారంగపూర్‌లో కొలువుదీరిన కష్టభంజన్ హనుమంతుడి గురించి మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. ఈ ఆలయానికి స్వామి నారాయణ సంప్రదాయం వారు చాలాసార్లు పునరుద్ధరణ పనులు చేపట్టడం జరిగింది. ఈ క్రమంలోనే స్వామి నారాయణ గౌరవార్థం ప్రధాన ఆలయానికి ఆనుకుని ఒక ప్రత్యేక మందిరాన్ని సైతం నిర్మించారు. ఇప్పుడు ఈ క్షేత్రానికి వెళ్లినవారు ఈ మందిరాన్ని సైతం దర్శించుకోవచ్చు. ఈ మందిరంలో నారాయణ స్వామి జీవితం, ఆయన బోధనలు వంటివి ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడికి వెళ్లినవారు ఈ మందిరంలో ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు.
2023 ఏప్రిల్ 6న, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సుమారు రూ.11 కోట్ల వ్యయంతో.. 30,000 కిలోల బరువు, 54 అడుగుల ఎత్తైన హనుమాన్ లోహపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహం అక్కడి నుంచి దాదాపు 7 కిలోమీటర్ల దూరం నుంచి చూసినా కూడా కనిపిస్తుంది. ఈ ఆలయంలోని హనుమాన్ విగ్రహం చాలా శక్తివంతమైనదని అంటారు. మేలిమి బంగారు దుస్తులతో కనిపించే ఈ హనుమ విగ్రహం చుట్టూ వనంలో నిత్యం వానర సైన్యం సంచరిస్తూ ఉంటుంది. హనుమ పాదాల చెంతనే శని భగవానుని ఆలయం కూడా ఇక్కడ ఉంటుంది.
