
చారిత్రకంగా ఈ పవిత్రోత్సవం 15వ శతాబ్దంలో అమల్లో ఉన్నట్లు తెలుస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆలయ పవిత్రతను కాపాడటానికి, ఏడాది పొడవునా జరిగే అర్చనలు, ఉత్సవాలలో యాత్రికుల లేదా సిబ్బంది వల్ల తెలియకుండా జరిగే దోషాలను నివారించడానికి వార్షిక ఉత్సవాలు నిర్వహిస్తారు. శ్రావణ శుద్ధ ఏకాదశినాడు ఉత్సవమూర్తిని తిరుమామణిమండపంలో వేంచేపు చేస్తారు. ద్వాదశినాడు తలకు, మెడకు, మణికట్టుకు తిరుపవిత్రంతో అలంకరించి దేవేరులతో కూడా ఊరేగింపు జరుపుతారు.
శ్రావణ శుక్లద్వాదశి విష్ణు పవిత్రారోపణ దినంగా తులసి పెంచటానికి ఉపయోగపడే భూమిలో పెరిగిన ప్రత్తి చెట్ల నుంచి తీసిన దారంతో ఈ పవిత్రం చేస్తారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అన్నప్రసాద నివేదన తప్పకుండా జరుగుతుంది. ఈ పవిత్రోత్సవాలను ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజమాసాల్లో శుక్లపక్షంలోని పాడ్యమి, విదియ, పంచమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, పౌర్ణమిల్లో భరణి, రోహిణి, పునర్వసు, పుష్యమి, హస్త, స్వాతి, రేవతి, శ్రవణం మొదలైన నక్షత్రాల్లో ఆచరించాలని పంచరాత్రాగమం చేస్తోంది. ఈ పవిత్రోత్సవాల్లో ఉపయోగించే పవిత్రాలు బంగారు, వెండి, రాగి, మృణ్మయం, పత్తి, ముంజ గడ్డి, దర్భ, పట్టు మొదలైనవాటితో చేస్తారు. అలా చేసిన పవిత్రాలను ఆచార్యుడు స్వీకరించి, పంచగవ్యాదులతో ప్రోక్షించి, ఆ ఆలయాగమాన్ననుసరించి పవిత్రాలకు యజ్ఞ ఆరాధనాదులను పూర్తి చేస్తారు. వీటిని స్వామికి సమర్పించడంవల్ల సర్వులకూ ఆయుః క్షేమాభివృద్ధి కలుగుతుంది.
శ్రీమన్నారాయణారాధనను అత్యంత భక్తిశ్రద్ధలతో సంవత్సర కాలం చేస్తే కలిగే ఫలితమంతా పవిత్రారోపణమాచరిస్తే కలుగుతుందని ప్రతీతి. ఈ పవిత్రోత్సవం మహా ప్రాయశ్చిత్తం కాబట్టి ప్రతీ సంవత్సరం చేయాలి. ఈ ఉత్సవం అలా ఆచరించకున్నా పరమాత్మకు సంవత్సరకాలం చేసిన ఆరాధనమంతా నిష్పలమవుతుంది. అందువల్ల ఈ ఉత్సవాన్ని ప్రతిసంవత్సరం ఆచరించాలని ఆగమశాస్త్రాలు చెప్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఉత్సవ విగ్రహాల్ని యాగశాలలో ఉంచడం, ఆ తర్వాత రోజు పవిత్రాలు యాగశాలలో ఉంచడం, తర్వాత పవిత్రసమర్పణం, పూర్ణాహుతి జరిపి ఉత్సవాలకు స్వస్తి వాచకం పలుకుతారు.
ఎప్పుడు ప్రారంభం…
ఈ పవిత్రోత్సవాలు హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలోని ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ముఖ్యమైన రోజులలో మూడు రోజుల పాటు జరుగుతాయి. ఉత్సవాలకు ముందు రోజు ‘అంకురార్పణం’తో ప్రారంభమవుతాయి, ఇందులో నవధాన్యాలను మట్టి పాత్రలలో విత్తుతారు.
