Site icon Bhakthi TV

ఆచమనంలోని ఆంతర్యం ఏమిటి?

ఎసోఫెగస్ అనేది మన గొంతుని పొట్టకు కలిపేటువంటి ఒక ట్యూబు. ఇది కండరాలతో నిర్మితమై వుండి, ఎప్పుడూ మూసుకునే ఉంటుంది. ఆహారం లోనికి తీసుకునేటప్పుడు మాత్రం తెరుచుకుని మళ్ళీ వెంటనే మూసుకుపోవాలి. అలా మూసుకుని జీర్ణాశయంలో ఉన్న యాసిడ్, ఆహారాలను బయటకు రాకుండా ఆపి రక్షిస్తూ ఉంటుంది. యాసిడ్ బయటకి లీక్ అయ్యి వస్తే దాన్నే మనం ఎసిడిటీ అంటాము. భోజనం చేసే ముందు ఈ ఎసోఫెగస్ సాఫీగా తెరుచుకోవడానికి బ్రాహ్మణులు చేసే “ఆచమనం” అనే పద్దతిని అందరూ పాటించాలి.

పరిశీలిస్తే ఈ ‘ఆచమనం’ అనే ప్రక్రియ ఒక శాస్త్రీయ దృష్ఠితో అలవరచుకున్న ఆరోగ్యకరమైన విధానం అని తెలుస్తుంది. కొందరు అనుకున్నట్టు ఒక మూఢాచారం కాదు. కొంచెం నీరు తీసుకుని ఆహారం మొదలుపెడితే ఎసోఫెగస్‌కి లూబ్రికేషన్ జరుగుతుంది, ఆహారం సాఫీగా పొట్టలోకి జారుతుంది. అంతేనా? అలాగైతే ముందుగా కాస్త నీళ్ళుతాగి భోజనం చెయ్యమని చెప్పచ్చుగా? కేశవ నామాలు దేనికి అని అనుమానం రావచ్చు. ఈ ఆచమనం భోజనం చేసే ముందే కాదు, ఏ పూజచేసేటప్పుడైనా కూడా చేస్తారు. అన్నిటికీ కలిపి ఒకే ప్రాసెస్ ని మనకు నేర్పారు అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి.

గొంతులో ‘ఎసోఫెగస్’ ఒక్కటే కాదు. సున్నితమైన శ్వాసనాళము, స్వరతంతంత్రులు వంటివి అనేకం ఉంటాయి. మంత్రోచ్చారణ చేయడానికి ముందు వాటికి కూడా కొంచెం ఒక నిర్ధిష్టపద్ధతిలో వ్యాయామం అవసరం. దానికి భగవన్నామాలతో మొదలు పెట్టమన్నారు. అదీ ఏ నామం పడితే అది అని చెప్పలేదు. కేశవ, నారాయణ, మాధవ అని మాత్రమే అనమన్నారు. ఎందుకంటే, ‘కేశవ’ నామం గొంతులోనుంచీ వస్తుంది. ‘నారాయణ’ నామం నాలిక సహాయంతో వస్తుంది. ‘మాధవ’ నామం పెదాల సహకారంతో వస్తుంది. అంటే నోటిలో అన్ని భాగాలకూ ఒక ఎక్సర్సైజ్ అన్న మాట.

Share this post with your friends
Exit mobile version